Sunita Williams: సునీతా విలియమ్స్ ఇటీవల కాలంలో మారుమోగుతున్న పేరు. జూన్ 5న 8 రోజుల మిషన్ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నానా, సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లని బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి పంపింది. అయితే, అక్కడి వెళ్లిన తర్వాత స్టార్‌లైనర్‌లో లీకేజీలను గుర్తించారు. నిజానికి ఈ స్టార్ లైనర్ అంతరిక్షానికి బయలుదేరే ముందే కొన్ని అడ్డంకులు ఎదురుకావడంతో లాంచ్ వాయిదా పడింది. తీరా అక్కడికి వెళ్లాకా హీలియం లీకులు, థ్రస్టర్లు విఫలం కావడంతో సమస్య తలెత్తింది. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కి చెందిన డ్రాగన్ క్రూ ద్వారా భూమిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
Read Also: Rain Alert: బంగ్లాదేశ్‌ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు అక్కడ నుంచే ఓటేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి ఇలా ఓటు హక్కుని వినియోగించే అవకాశం ఉందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. వ్యోమగాములు 1997 నుంచి అంతరిక్షం నంచి ఓటేస్తున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 1997లో టెక్సాస్ శాసనసభకు నాసా ఉద్యోగులు అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి అనుమతించే బిల్లుని ఆమోదించారు. అప్పటి నుంచి అంతరిక్షం నుంచి ఓటేసే పద్ధతి ప్రారంభమైంది.
ఈ ప్రక్రియలో జాన్సన్ స్పేస్ సెంటర్(జేఎస్‌సీ) మిషన్ కంట్రోల్ ద్వారా వ్యోమగాములు ఎన్‌క్రిప్టెడ్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌ని పంపడం జరుగుతుంది. వ్యోమగాములు వారి బ్యాలెట్‌లను యాక్సెస్ చేయడానికి, వారి ఓట్లు వేయడానికి, తిరిగి వాటిని భూమి పైకి కౌంటీ క్లర్క్ కార్యాలయానికి పంపడానికి ఈమెయిల్ ద్వారా ప్రత్యేకమైన క్రెడెన్షియల్స్ పంపుతారు. వాటిని యాక్సెస్ చేసి ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. అంతరిక్షం నుంచి తొలిసారి ఓటు వేసిన తొలి అమెరికన్ వ్యక్తిగా డేవిడ్ వోల్ఫ్ అనే నాసా వ్యోమగామి చరిత్ర సృష్టించాడు. 2020లో నాసా ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఓటు వినియోగించుకున్నారు. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ టెక్సాస్‌లోని హారిస్ కౌంటీలో ఉంది. అక్కడి అధికారులు వ్యోమగాములు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పీడీఎఫ్ బ్యాలెట్‌ని పంపడానికి నాసాతో కలిసి పనిచేస్తున్నారు. ఓటు సీక్రెట్‌గా ఉండేందుకు పీడీఎఫ్‌కి ప్రొటెక్టెడ్ పాస్‌వర్డ్ ఉంటుంది. వీరితో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో ఉన్నారు.