Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో అమెరికా చేపట్టిన నాకాబందీ చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. ఇరాన్‌పై నాకాబందీని కఠినంగా అమలు చేస్తున్న అమెరికా నౌకాదళం వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ 2 నాటికి నిబంధనలు పాటించేలా చేయడంలో భాగంగా అమెరికా నౌకాదళం 86 వాణిజ్య నౌకల మార్గాలను మార్చింది. మూడు నౌకలను నిలిపివేసింది. మరో రెండు నౌకల్లోకి సిబ్బంది ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. ఈ చర్యలు హోర్ముజ్ జలసంధిలో అమెరికా చేపడుతున్న నాకాబందీలో భాగమని CENTCOM వెల్లడించింది. మరోవైపు యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఏకంగా 10 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించారు. యెమెన్ ప్రభుత్వ బలగాల ప్రకారం.. పశ్చిమ యెమెన్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులను ప్రయోగించారు. తైజ్ ప్రావిన్స్‌లోని మొఖా నగరం, హొదైదా ప్రావిన్స్‌లోని అల్-ఖోఖా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సమాచారం.
వీటిలో ఎక్కువ మిసైళ్లు మొఖా వైపే ప్రయోగించినట్లు యెమెన్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని వారాలుగా మొఖా నగరంపై హూతీలు డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా మిసైల్ దాడులు జరిగిన సమయంలోనే యెమెన్‌లో హూతీలు, ప్రభుత్వ బలగాల మధ్య భూమి కూడా పోరాటం తీవ్రతరం కావడం ఆందోళన కలిగిస్తోంది. తైజ్‌లోని అల్-కదాహా-అల్-బరాహ్ ప్రాంతంలో హూతీ సాయుధులు భూదాడికి ప్రయత్నించినట్లు యెమెన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వ బలగాలు ఈ దాడిని తిప్పికొట్టి హూతీ యోధులను వెనక్కి పంపినట్లు పేర్కొన్నాయి. ఒకవైపు హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం నాకాబందీని కొనసాగిస్తుండగా.. మరోవైపు యెమెన్‌లో హూతీల మిసైల్, భూదాడులు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

