తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవి నుంచి మహిందా రాజపక్స తప్పుకున్న తరువాత పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐఎంఎఫ్, విదేశాల నుంచి సహాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్ కోసం ప్రజలు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోలియం ఉత్పత్తులను కొనడానికి కూడా శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు.
ఇదిలా ఉంటే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసాలు జారీ చేస్తున్నారు. శ్రీలంక మంత్రి ధమ్మిక పెరీరా దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసాలు అందచేశారు. వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించేందుక ఈ చర్య తీసుకున్నారు.
భారత్, శ్రీలంక మధ్య వ్యాపార సంబంధాలను సులభతరం చేసేందుకు గత బుధవారం భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, శ్రీలంక వాణిజ్య మంత్రి నలిన్ ఫెర్నాండోతో కీలక చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే మనవతా సహాయం కింద భారత్, శ్రీలంకకు పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, ఔషధాలను అందచేస్తోంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న శ్రీలంకను రక్షించేందుకు సహాయపడుతోంది. భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా కొనియాడింది.
