NTV Telugu Site icon

Srilanka Economic Crisis: తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే.. ఎమర్జెన్సీ విధింపు

Srilanka Crisis

Srilanka Crisis

శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి భద్రతా బలగాలు. గొటబాయ పారిపోయేందుకు రణిల్ విక్రమసింఘే సహకరించారని ప్రజలు నినాదాలు చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే శ్రీలంకలో ఎమర్జెన్సీ డిక్లర్ చేశాడు రణిల్ విక్రమసింఘే. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో అత్యవసర పరిస్థితి విధించాడు. ఈ రోజు ఉదయం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంకను వదిలి మాల్దీవులకు పారిపోవడంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను రణిల్ విక్రమసింఘే తీసుకున్నాడు. దేశంలో పెరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి అధికార ప్రతినిధి దినౌక్ కొలంబేజ్ వెల్లడించారు.

Read Also: Doctor Cheating: మ్యాట్రిమోనీలో కలిశాడు.. నట్టేట ముంచేశాడు

దేశ రాజధాని కొలంబోతో పాటు పశ్చిమ ప్రావిన్స్ మొత్తం కర్ప్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే బుధవారం రాజీనామా చేస్తా అని వెల్లడించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. దీంతో అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా సజిత్ ప్రేమదాసను ఎన్నుకునేందుకు వివిధ పార్టీలు మంతనాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం తన భార్యతో పాటు మరో ఇద్దరు బాడీగార్డులతో కలిసి శ్రీలంకన్ నేవీ విమానంలో మాల్దీవులు రాజధాని మాలేకు పరారయ్యాడు గొటబాయ రాజపక్స.