NTV Telugu Site icon

Srilanka Crisis: శ్రీలంకలో ఉద్రిక్తత.. ఆందోళనకారులపైకి సైన్యం కాల్పులు

Srilanka Crisis

Srilanka Crisis

Srilanka Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఆహార, మందులు, ఎరువులు, ఇంధన కొరత ఎక్కువైంది. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇంధన సమస్యల కారణంగా శ్రీలంకలో రెండు వారాల పాటు స్కూళ్లు, ప్రభుత్వ  కార్యాయాలు మూసేయాని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం ప్రజలు పడిగాపులుకాస్తున్నారు. ఇంధన దిగుమతి చేసుకుంటున్నా కూడా వాటికి కట్టేందుకు విదేశీ మారక నిల్వలు శ్రీలంక ప్రభుత్వం దగ్గర లేవు.

తాజాగా ఇంధన స్టేషన్ల వద్ద అల్లర్లను అదుపు చేసేందుకు శ్రీలంక సైన్యం కాల్పులు జరిపింది. దేశం అంతటా పెట్రోల్ , డిజిల్ కోసం పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొలంబోకు 365 కిలోమీటర్ల దూరంలో ఉనన విశ్వమడులో శనివారం రాత్రి ఆందోళకారులపైకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు శ్రీలంక గార్డులపైకి రాళ్లురువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని సైన్యం ప్రతినిధి నీలంత ప్రేమరత్నే తెలిపారు.

20 నుంచి 30 మంది వ్యక్తులు రాళ్లతో దాడి చేసి ఆర్మీ ట్రక్కును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో  నలుగురు పౌరులు, ముగ్గురు ఆర్మీసైనికులు గాయపడ్డారు. పెట్రోల్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలు పెట్రోల్ అయిపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. 1948లో బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం  పొందిన తర్వాత శ్రీలంక ఇటీవంటి సంక్షోభాన్ని తొలిసారిగా ఎదుర్కొంటోంది. దేశంలోని 2.2 కోట్ల జనాభా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. శ్రీలంక ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.