శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని పదవికి మహీందా రాజపక్సే రాజీనామా చేశారు. ప్రధాని మహిందా రాజపక్సే తో పాటు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఉన్న కోపంతో నిరసనకారులు రాజపక్సే పూర్వీకుల ఇళ్లను పూర్తిగా కాల్చివేశారు.
ఇదిలా ఉంటే హింసాత్మక ఘటనలు జరుగుతున్న క్రమంలో పోలీసులు, ఆర్మీకి విశేషాధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కనిపిస్తే కాల్చివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నిరసనకారులు అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా రాజకీయ నాయకులును ఉరికించి కొడుతున్నారు. రాజపక్సే సర్కార్ ను కనీసం గద్దె దించలేకపోతున్నారని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను తరిమికొట్టారు.
ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్ ఇచ్చింది శ్రీలంక కోర్ట్. దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మహిందా రాజపక్సే భద్రత కారణాలతో ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. ఓ నేవల్ బేస్ లో మహిందా రాజపక్సే ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో గోటబయ ప్రభుత్వ కాళ్ల బేరానికి వచ్చింది. వారం రోజుల్లోనే కొత్త ప్రధాని, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా ప్రధాని తరహా పాలన తీసుకువస్తామని అందుకు తగ్గట్లుగానే రాజ్యాంగంలో మార్పులు చేస్తామని అన్నారు.