ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేయాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది శ్రీలంక కోర్ట్. రాజపక్సేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల అటార్నీ సెనక పెరీరా కొలంబో మెజిస్ట్రేట్ ముందు వ్యక్తిగత ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల కొలంబోలో గాలే ఫేస్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాజపక్సే అనుచరులు వచ్చి నిరసనకారులపై దాడులు చేశారని.. ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారని… 200 మందికిపైగా ప్రజలు గాయపడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్ట్ మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సేతో పాటు పార్లమెంట్ సభ్యులు జన్సన్ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నే, సనత్ నిశాంత, మెటువా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ సమన్ లాల్ ఫెర్నాండో, సీనియర్ పోలీస్ అధికారి దేశబంధు తెన్నకూన్, చందన విక్రమరత్నేలను తక్షణమే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు.
శ్రీలంకలో కొత్తగా రణిల్ విక్రమసింఘే బాధ్యలు చేపట్టినా… ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా గద్దెదిగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భయంతో మాజీ ప్రధాని తన అధికారిక నివాసాసం టెంపుల్ ట్రీస్ నుంచి పారిపోయి ట్రింకోమలీలోని నౌకాదళ స్థావరంలో ఆశ్రయం పొందుతున్నాడు. దేశంలో ఈ ఏడాది మొదటి నుంచి వరసగా ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు వీపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఎప్రిల్ 9 నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.