దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ఆ దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల కిందట కోవిడ్ పాజిటివిటీ రేటు 2శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. ఇన్‌ఫెక్షన్ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో… కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్ త్వరలోనే సమావేశమవుతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు.
తమ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైనట్లు యూకే తాజాగా వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 336 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వీటిలో 261 కేసులు ఇంగ్లాండ్లోనే బయటపడ్డాయ్. కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారు. తమ దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి మొదలైనట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. సిడ్నీలోని ఐదుగురు స్థానికుల్లో ఒమిక్రాన్ బయటపడింది. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో 15 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.