Site icon NTV Telugu

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై దాడులు.. కెనడాలో ఘటన..

Nijjar Murder

Nijjar Murder

Canada: కెనడా మరోసారి ఉలిక్కిపడింది. ఆ దేశం ఇప్పటికే భారత వ్యతిరేకత, ఖలిస్తానీలకు అడ్డాగా మారింది. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కెనడాలోని సర్రే నగరంలోని గురుద్వారా ముందర గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మొదలైంది. మరోవైపు భారత్, ఇది కెనడా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని, ఉగ్రవాదులకు అడ్డగా మారిందని ఘాటుగానే విమర్శించింది.

Read Also: Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి 5 రోజుల ఈడీ కస్టడీ..

ఇదిలా ఉంటే, తాజాగా నిజ్జర్ సన్నిహితుడు, సర్రేలో నివాసం ఉంటున్న సిమ్రంజీత్ సింగ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు. ఈ ఘటనపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తు ప్రారంభించినట్లు కెనడాకు చెందిన మీడియా నివేదించింది. గురువారం తెల్లవారుజామున 1:20 గంటల తర్వాత తుపాకీ కాల్పుల ఘటనపై స్పందించినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించడంతో పాటు స్థానికులను అక్కడి పోలీసులు విచారిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అతని ఇంటిపై బుల్లెట్ రంధ్రాలు, కాల్పుల్లో దెబ్బతిన్న కారు కనిపించింది. అయితే, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, దీనికి ఎవరు కారణమనేది నిర్ధారించబడలేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

Exit mobile version