పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించినా.. ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ఇవాళ పాక్ పార్లమెంట్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, ఆ అవిశ్వాన తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి ప్రకటించారు.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్న పార్లమెంటు సభ్యులను వారి సంఖ్యను లెక్కించడానికి నిలబడాలని కోరారు డిప్యూటీ స్పీకర్… రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీలో ఉన్న 20 శాతం MNAలు తీర్మానానికి మద్దతు ఇవ్వాలి.. తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడిన సభ్యుల లెక్కింపు అనంతరం డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం తెలిపారు, ఈ నెల 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టబోతున్నారు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య ఓటింగ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Read Also: Gangster Nayeem: నయీమ్ కేసులో కీలక మలుపు..
ఇక, ఇప్పటికే అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు. పీటీఐ సభ్యులు ప్రస్తుతం సింధ్ హౌస్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 24 మంది ఎంపీలు చివరి రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంటులో 172 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రధాని కుర్చీ నుంచి ఆయన దిగిపోవాల్సిందే. ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్ ముస్లింలీగ్ -నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఖాన్ పదవికి గండం ఏర్పడింది. మరోవైపు, గతంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. మరి, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం నుంచి గట్టెక్కుతారా..? లేదా అనే ఉత్కంఠగా మారింది..