MH370 Disappearance: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు. అసలు ఈ విమానానికి ఏమైదనే విషయాన్ని ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటర్లు కనిపెట్టలేకపోయారు. మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కి 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైంది. ఇప్పటివరకు ఈ MH370 విమానం అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
అయితే, 10 ఏళ్ల తర్వాత ఈ విమానం కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. మలేషియా ప్రభుత్వం విమానం శిథిలాల కొత్త వెతుకులాటకు ఆమోదం తెలిపింది. 2018లో శిథిలాల శోధనలో పాలుపంచుకున్న సముద్రగర్భ అన్వేషన సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ, గతేడాది డిసెంబర్‌లో మలేషియా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రేలియా పెర్త్ నుంచి కొత్త అధునాతన సాధనాలతో హిందూ మహాసముద్రాన్ని జల్లెడ పట్టనుంది. ఓషన్ ఇన్ఫినిటీ ఆఫ్‌షోర్ చమురు, గ్యాస్ నిల్వల కోసం సర్వే చేస్తుంది. ఇది శిథిలాలను కూడా వెతుకుతుంది. 2018లో, అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 1,000 మీటర్ల నీటి అడుగున తప్పిపోయిన అర్జెంటీనా నేవీ జలాంతర్గామిని కంపెనీ కనుగొంది. మరియు గత అక్టోబర్‌లో, 78 సంవత్సరాలుగా నీటి అడుగున ఉన్న US నేవీ నౌక శిథిలాన్ని కనుగొంది.
Read Also: NZ vs Pak: ఎట్టకేలకు గెలుపు సాధించిన పాకిస్థాన్.. హసన్ నవాజ్ తుఫాను సెంచరీ
ఓషన్ ఇన్ఫినిటీ నుండి వచ్చిన కొత్త ప్రతిపాదనను అనుసరించి శిథిలాల కోసం అన్వేషణను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. శిథిలాలను కనుగొంటే, విఫలమైతే ఎలాంటి చెల్లింపులు ఉండవు. విమానం బ్లాక్ బాక్స్‌లను కనుగొనడాన్ని ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఇవి లభ్యమైతే, చివరి క్షణాల్లో విమానానికి ఏమైందనే విషయం తెలుస్తుంది.
విమానానికి ఏమైంది..?
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం నుంచి చివరిసారిగా ట్రాన్స్‌మిషన్ జరిగింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో”తో సైన్ ఆఫ్ చేసాడు. అదే సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత దాని ట్రాన్‌పాండర్ ఆఫ్ చేయబడింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. మిలిటరీ రాడార్ ప్రకారం.. విమానం తన మార్గం నుంచి తప్పినట్లు తెలుస్తోంది. మలేషియా, పెనాంగ్ ద్వీపం మీదుగా ఇండోనేషియా సుమత్రా ద్వీపం కొనలో ఉన్న అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది.
మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 120,000 చదరపు కి.మీ (46,332 చదరపు మైళ్ళు) ప్రాంతంలో ఇన్‌మార్‌శాట్ ఉపగ్రహం, విమానం మధ్య ఆటోమేటిక్ కనెక్షన్ డేటా ఆధారంగా నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపుగా 143 మిలియన్ డాలర్లను విమాన శోధన కోసం ఖర్చు చేశారు. విమానం జాడ తెలియకపోవడంతో జనవరి 2017లో సెర్చింగ్ నిలిపేశారు.