Site icon NTV Telugu

Pakistan-Saudi Pact: భారత్‌-పాక్ యుద్ధం జరిగితే, సౌదీ భారత్‌పై దాడి చేస్తుందా..? కొత్త ఒప్పందం ఏం చెబుతోంది.?

Pakistan Saudi Pact

Pakistan Saudi Pact

Pakistan-Saudi Pact: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్‌పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ భారత్‌పై యుద్ధానికి దిగుతుందా.? అంటే సందేహమే. కానీ, పాకిస్తాన్ మాత్రం మాకు అండగా సౌదీ ఉందని తెగ ఫీల్ అవుతోంది.

ఇజ్రాయిల్ టార్గెట్..

నిజానికి ఈ ఒప్పందం భారత్ కన్నా, ఇజ్రాయిల్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఇటీవల, హమాస్ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమకు వ్యతిరేకంగా, తమ ఉనికిని ప్రశ్నించే వారి పట్ల తాము దాడులు చేస్తామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఖతార్‌ను కూడా ఇజ్రాయిల్ వదలలేదు. తాజాగా, పాక్-సౌదీల ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ భారత్ కన్నా, ఇజ్రాయిల్‌నే లక్ష్యంగా చేసుకుంది.

నిజానికి, సౌదీకి భారత్‌తోనే ఎక్కువ వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నిజంగా పాకిస్తాన్‌తో భారత్ యుద్ధమే చేస్తే సౌదీ రంగంలోకి దిగుతుందనేది అనుమానమే. ఎందుకంటే, భారత్‌తో సౌదీ లెక్కలు వేరుగా ఉంది. నాటో తరహా ఒప్పందంలో ‘‘ఒకరిపై దాడి= రెండింటిపై దాడి’’ అనే పదాలు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చూస్తోంది. ఇది సౌదీతో అతిపెద్ద దౌత్యవిజయంగా ఆ దేశం పేర్కొంటోంది.

భారత్‌‌కి హెచ్చరిక కాదు..

అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ భారత్‌ని లక్ష్యంగా చూస్తుంటే, సౌదీ ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చూస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు భారత్‌పై యుద్ధానికి వస్తాయనేది అర్థం కాదని అంతర్జాతీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

సౌదీ అరేబియా భారతదేశానికి నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, భారత్ సౌదీకి రెండో అతిపెద్ద భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ద్వైపాక్షిక వాణిజ్యం USD 41.88 బిలియన్ల వద్ద ఉంది. రెండు దేశాలు లోతైన ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటాయి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడితే, సౌదీ అరేబియాతో వారి వాణిజ్యం కేవలం 3-4 బిలియన్ డాలర్లు మాత్రమే.

భవిష్యత్తులో భారత్-పాక్ యుద్ధమే వస్తే, సౌదీ భారత్‌తో తన సంబంధాలను ప్రమాదంలో పడేయదు. కానీ, ఇజ్రాయిల్ సౌదీపై దాడి చేస్తే మతం, రాజకీయాలు, ఒప్పందం కోసం జోక్యం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా చాలా ఏళ్లుగా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమంపై తన ఆసక్తిని చూపిస్తోంది. నిజానికి, పాక్ అణ్వాయుధ కార్యక్రమాలకు సౌదీ నిధులు సమకూర్చినట్లు చాలా మంది నమ్ముతారు. ఇదే విషయం రిటైర్డ్ పాకిస్తాన్ జనరల్ ఫిరోజ్ హసన్ ఖాన్ రాసిన ‘ఈటింగ్ గ్రాస్: ది మేకింగ్ ఆఫ్ ది పాకిస్తానీ బాంబ్’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.

Exit mobile version