Salman Rushdie Off Ventilator And Able To Talk Says Agent: న్యూయార్క్‌లో ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో.. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే! ఈ దాడిలో రష్దీకి తీవ్ర గాయాలవ్వడంతో.. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వైద్యులు నిరంతరంగా చికిత్స అందించడంతో.. ఇప్పుడు ఆయన ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్టు తెలిసింది. తాజాగా వెంటిలేటర్ తొలగించారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మాట్లాడగులుగుతున్నారని కూడా మరో రచయిత ఆతిష్ తసీర్ తెలిపారు. బెడ్‌పై ఉండి కూడా ఆయన ఛలోక్తులు పేల్చుతున్నారని పేర్కొన్నాడు. ఆయన మాటలు ముమ్మాటికీ నిజమేనని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ నిర్ధారించారు.
కాగా.. న్యూయార్క్‌లోని చౌటాక్వా స్వచ్ఛంద విద్యాసంస్థలో నిర్వహించిన ఓ సదస్సులో సల్మాన్ రష్దీ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, 24 ఏళ్ల హాదీ మతార్ అనే యువకుడు ఆయనపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మెడ, ఉదరంలో తీవ్ర గాయాలవ్వడంతో.. వేదికపైనే రష్దీ కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని, కాలేయం కూడా బాగా దెబ్బతిందని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్ అప్డేట్స్ బయటకొచ్చాయి.
అటు.. రష్దీపై దాడి చేసిన హాదీ మతార్‌కు ఏ గ్రూపుతో సంబంధాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫేస్‌బుక్ పోస్టుల ఆధారంగా.. అతడు షియా అతివాద ధోరణుల పట్ల ఆకర్షితుడై ఉంటాడని, తన సొంత సిద్ధాంతాలతోనే ఒంటరిగా ఈ కార్యాచరణకు దిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. హాదీని ఇరాన్‌లో హీరోగా కీర్తిస్తున్నారు. ఇందుకు కారణం.. 80వ దశకంలో రష్దీ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ అనే పుస్తకమే! ఆ పుస్తకం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ అధినాయకత్వం.. దాన్ని 1988లో నిషేధించడంతో పాటు రష్దీని చంపేయాలంటూ ఫత్వా కూడా జారీ చేసింది.