Site icon NTV Telugu

Russia-Ukraine War: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా దాడి.. 22 మంది మృతి

Russia Ukraine War

Russia Ukraine War

Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.

ఉక్రెయన్ లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌కు పశ్చిమాన 145 కి.మీ దూరంలో ఉన్న చాప్లిన్ అనే చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడులు చేసింది..నాలుగు రైల్వే క్యారేజీలు అగ్నికి ఆహుతి కాగా.. 22 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాలను యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో వీడియో ప్రసంగంలో జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యాకు ఎప్పటికీ లొంగబోమని.. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు అన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే రష్యా దాడుల్లో రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం అయిన ఖార్కీవ్ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖార్కీవ్ లో విధ్వంసం తారాస్థాయిలో ఉంది. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలపై కూడా రష్యా మిస్సైళ్లతో దాడులు చేసింది.

Read Also: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక విచారణ..

1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఉక్రెయిన్ ఏర్పడింది. ఆగస్టు నెలలో ఉక్రెయిన్ స్వాతంత్య్ర వేడుకలను చేసుకుంటోంది. ఉక్రెయిన్ నాటో సైనిక కూటమిలో చేరే ప్రయత్నంతో రష్యా, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది. ఇప్పటి వరకు యూఎస్ఏ ఉక్రెయిన్ కు 13.5 బిలియన్ డాలర్ల సైనిక, ఆయుధ సహాయాన్ని అందించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 2 వేల డ్రోన్లను, 63.5 మిలియన్ డాలర్ల సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతంలోని లూహాన్స్క్, డొనేత్సక్ ప్రావిన్సుల్లోని చాలా ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచే రష్యా దాడులను చేస్తోంది.

Exit mobile version