Russia-US: అమెరికా, రష్యాల మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల రష్యా నుంచి అమెరికా భారీ స్థాయిలో డీజిల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాలు మరో కీలక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లకు రష్యా నుంచి అణు విద్యుత్ సరఫరా చేసే అవకాశాలపై ఇరు దేశాలే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడిగా పేరున్న కిరిల్ డిమిత్రియేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా, రష్యాలు కలిసి డేటా సెంటర్ల ప్రాజెక్టును చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్నింటికి రష్యా అణువిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా చేయవచ్చని కిరిల్ పేర్కొన్నారు. చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లను ఉపయోగించే అవకాశాలపై కూడా ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలు విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థిరమైన, నిరంతర విద్యుత్ కోసం అణు విద్యుత్‌ను ఎంచుకుంటున్నారు.
రష్యా, అమెరికా మద్య ఇటీవల డీజిల్ ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరలను అరికట్టే లక్ష్యంతో, దేశీయ మరియు ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నులకు పైగా రష్యన్ డీజిల్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా, రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 2027 వరకు రష్యన్ డీజిల్‌కు సంబంధించిన లావాదేవీలకు అధికారం ఇస్తూ అమెరికా ట్రెజరీ శాఖ ఒక తాత్కాలిక సాధారణ లైసెన్స్‌ను జారీ చేసింది.

