ఉక్రెయిన్ పై భీకరదాడిని కొనసాగిస్తోంది రష్యా. యుద్ధం ప్రారంభం అయి నాలుగు నెలలు గడిచినా.. రష్యా తన దాడిని ఆపడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలు మసిదిబ్బను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా దాడులను ఎక్కువ చేసింది. క్రమంగా ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతోంది.
తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 21 మంది మరణించారు. బ్లాక్ సీ ఒడెస్సా పోర్టుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్ పట్టణం సెర్గివ్కాపై రష్యా దాడి చేసింది. మిస్సైల్ స్ట్రైక్ వల్ల ఓ అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా దాడిలో 12 ఏళ్ల బాలుడితో పాటు 20 మంది మరణించారు. రష్యా దాడిని ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభివర్ణించాడు.
ఫిబ్రవరి నెలలో మొదలైన యుద్ధం ఉక్రెయిన్ ను సర్వనాశనం చేస్తోంది. బలమైన రష్యా ముందు కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్ తెగించి పోరాడుతోంది. అమెరికా, నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి కొన్ని నెలులు ప్రయత్నించినా రష్యాకు సాధ్యపడలేదు. దీంతో చేసేందేం లేక తూర్పు ప్రాంతం నుంచి దాడులు మొదలుపెట్టింది ఉక్రెయిన్.
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ లోని చారిత్రక సంపద దెబ్బతింటోంది. కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు రష్యా దాడులతో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే వీధుల్లో పడి ఉన్న శవాల వల్ల కలరా వ్యాపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం బాంబులు, క్షిపణులతో నిండి ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది.
