ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ… అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, సైనిక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రష్యన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బెలారస్, టర్కీ వేదికగా ఇరుదేశాలు పలుమార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. మరోవైపు ‘విక్టరీ డే’ వేడుకల్లో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఉక్రెయిన్ పై సైనిక చర్యను సమర్ధించుకున్నారు. పశ్చిమ దేశాల కుట్ర వల్లే యుద్ధం అనివార్యమైందని స్పష్టం చేశారు. మరోవైపు రష్యా ఎంత ప్రయత్నించినా… ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకోలేకపోయింది. మరియోపోల్, సుమీ, ఖార్కీవ్ వంటి నగరాలను రష్యా ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి దాడులను ముమ్మరం చేసింది.
ఇప్పటికే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే అనేక ఆంక్షలు విధించినా… రష్యా వెనక్కి తగ్గడం లేదు. రష్యా విమానాలకు తమ గగనతలంపై ప్రయాణించడాన్ని పశ్చిమ నిషేధించాయి. పలువురు రష్యా వ్యాపారుల ఆస్తులపై ఆంక్షలు విధిస్తోంది. దీనికి ప్రతిగా రష్యా కూడా అంతే స్థాయిలో ప్రతిచర్యలు దిగుతోంది. ఇప్పటికే రష్యాలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యాకు జీ7 దేశాలు షాక్ ఇవ్వబోతున్నాయి. రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ముడిచమురు, గ్యాస్ పై నిషేధం విధించాలని నిర్ణయించాయి. రష్యాకు ముఖ్యంగా విదేశీ ఆదాయాన్ని ఆర్జించిపెడుతుంది ముడి చమురే. రష్యా నుంచి యూరప్ దేశాలతో పాటు పలు పశ్చిమ దేశాలకు ముడి చమురు, గ్యాస్ ఎగుమతి జరుగుతోంది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా యూరప్ లోని జర్మనీ వంటి దేశాలకు గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే తాజాగా రష్యా ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ముడిచమురు ఎగుమతులను దెబ్బతీయాలని జీ7 దేశాలు భావిస్తున్నాయి. జీ 7లో భాగమైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాధినేతలు దశల వారీగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే జరిగితే రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యా గెలవకూడదని జీ 7 దేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటలీ, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించి.. ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. జపాన్ కూడా ఇదే బాటలో పయణిస్తోంది.