Site icon NTV Telugu

Russia President: పుతిన్‌.. ఒక నియంత ప్రేమ కథ..!

నియంతల కథలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వారిలో చాలా మంది జీవితం అట్టడుగు నుంచి అత్యున్నత అధికార శిఖరం ఎక్కినవారే. ప్రస్తుతం ప్రపంచాన్ని నిద్రకు దూరం చేసిన రష్యా అధినేత వ్లాడిమీర్‌ పుతిన్‌ కథ కూడా అందుకు భిన్నం కాదు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడయ్యాడు. రెండు దశాబ్దాలుగా సువిశాల రష్యాను ఎదురులేకుండా ఏలుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్నది ఆషామాషీ యుద్ధం కాదు. నాటో శక్తులన్నీ ఏకమై అవకాశం కోసం కాసుకుని కూర్చున్నాయి. దీనిని పక్కన పెడితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పుతిన్‌ జీవిత విశేషాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.

పుతిన్‌ గతంలో సోవియట్‌ గూఢచార సంస్థ కేజీబీ ఏజెంట్‌గా పనిచేశాడు. కనుక గోప్యత అనేది ఆయన జీవితంలో భాగమైంది. ఆయన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఐతే, తరచూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి వెస్ట్రన్‌ మీడియాలో కథనాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్న వేళ ఆయన పర్సనల్‌ లైఫ్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. ఆయన రహస్య వివాహం చేసుకున్నాడని బావిస్తున్న ఒలింపిక్ గోల్డ్‌ మెడల్‌ విజేత, మాజీ రిథమిక్ జిమ్నాస్ట్ అలీనా కబేవా గురించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

38 ఏళ్ల కబేవా 2019 ఏప్రిల్ లో కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలకు తండ్రి పుతిన్ అంటోంది మీడియా. డెలివరీ కోసం ఆమె కులకోవ్ రీసెర్చ్ సెంటర్ కు వెళ్లినపుడు విఐపీలకు ఉద్దేశించిన నాల్గవ అంతస్తు మొత్తాన్ని ఆమె ఉండటానికి ఖాళీ చేయించారు. అప్పట్లో అది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే పుతిన్‌ పిల్లలకు తల్లి కాబోతోందని బయటపడిందో అప్పటి నుంచి ప్రజల కంట పడకుండా అదృశ్యమైంది. తరువాత రెండున్నర ఏళ్లకు కానీ మళ్లీ ఆమె జనం ముందుకు రాలేదు. 2021లో రష్యన్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో రష్యా మహిళా జిమ్నాస్టిక్స్ జట్టుకు సాయం అందించటం కోసం బయటి ప్రపంచంలోకి వచ్చింది.

పుతిన్ మాజీ కేజీబీ సహచరుడు అలెగ్జాండర్ లెబెదేవ్ కు చెందిన”మాస్కో కొరెస్పాండెంట్” 2008లో తొలిసారి పుతిన్‌, కబేవా అనుబంధాన్ని బయటపెట్టింది. అప్పటికి పుతిన్ ఇంకా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. 2013లో పుతిన్ తన మొదటి భార్య లియుడ్మితో విడిపోతున్నట్టు ప్రకటించాడు. 2014లో వారి విడాకులు ఖరారయ్యాయి. ఇది ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయమని పుతిన్‌ అప్పట్లో చెప్పారు. తాము ఒకరినొకరం చూసుకోవటమే కష్టంగా ఉందని.. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని పుతిన్‌ తన విడాకుల ప్రకటన సందర్భంలో చెప్పారు. తరువాత ఆయన భార్య వేరొకరిని వివాహం చేసుకుంది.

కబేవా, పుతిన్ ఏనాడూ తమ సంబంధాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు. 2016లో కబేవా తొలిసారి వెడ్డింగ్‌ రింగ్‌తో కనిపించింది. కెమెరా కంట పడకుండా ఉండాలని ప్రయత్నించింది. తరువాత రష్యన్ వార్తాపత్రిక “మోస్కోవిస్కీ కోమ్సోమోలెట్స్‌” కబేవా, పుతిన్ రహస్య కవలల కథనాన్ని ప్రచురించింది. కానీ, తరువాత వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. 2015లో పుతిన్‌ ద్వారా కబేవా ఒక కుమార్తెకు జన్మనిచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. పుతిన్ గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా సార్లు ప్రస్తావించారు. తనకూ ఒక వ్యక్తిగత జీవితం ఉందని అందులోకి ఎవరు చొరబడినా ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పాడు. అందుకే తన వ్యక్తిగత జీవితం గురించి ప్రయత్నించిన వారి పట్ల పుతిన్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తాడు.

పుతిన్ చాలా ప్రైవేట్ వ్యక్తి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ వారు ఎక్కడ ఉంటారు.. ఏం చేస్తున్నారనే వివరాలేవీ తెలియదు. మాస్కో రక్షణ సిబ్బంది వారిని నీడలా అనుక్షణం వెన్నంటే ఉంటుందన్నది మాత్రం నిజం. నకిలీ ఐడీలతో వారు మాస్కోలోనే ఉన్నారని అంటారు. పుతిన్‌ అప్పుడప్పుడు వారి గురించి ప్రస్తావించినప్పటికీ వారి పేర్లు మాత్రం ఏనాడూ వెల్లడించలేదు. ఆయన రహస్య భార్య అలీనా విషయం కూడా అంతే. పుతిన్‌ తన కుటుంబం భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాడని దీనిని బట్టి తెలుస్తోంది. అంతేకాదు ఈ యుద్ధ సమయంలో అణ్వాయుధ ముప్పు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వారిని అత్యంత సురక్షితమైన రహస్య బంకర్‌కు తరలించాడనే కథనాలు వినిపిస్తున్నాయి.

పుతిన్‌ రహస్య ప్రియురాలు అలీనా కబేవా ఆటల నుంచి రిటైర్‌ అయిన తరువాత రాజకీయాలలో ప్రవేశించింది. కొంతకాలం మీడియా మేనేజర్ గా కూడా వ్యవహరించింది. కబేవా తండ్రి మరాట్ కబాయేవ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్.తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మూడేళ్ల వయస్సులో రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశించి అనంతరం రెండు ఒలింపిక్ పతకాలు, 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, 21 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ పతకాలు గెలుచుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.

కబేవా 2005 నుంచి పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యాలో సభ్యురాలు. 2008 ఫిబ్రవరి నుంచి నేషనల్ మీడియా గ్రూప్ పబ్లిక్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2007- 2014 మధ్య యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున రష్యా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2014 సెప్టెంబరులో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నేషనల్ మీడియా గ్రూప్ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ అధ్యక్ష పదవిని చేపట్టింది.

మరోవైపు, పుతిన్‌ లైఫ్‌ స్టయిల్ గురించి ఇప్పటికే అనేక కథలు సర్క్యెలేషన్‌లో ఉన్నాయి. వాటిలో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. వివిధ కథనాల ప్రకారం ఆయనకు కనీసం 50కి పైగా విమానాలు ఉన్నాయి. పుతిన్‌కు విమానాలు నడపటం అంటే చాలా ఇష్టం.అంతే కాదు ఆయన మంచి రేసర్‌ కూడా. సబ్ మెరైన్స్ నడిపిన అనుభవం కూడా ఉంది. 2012 నాటికి పుతిన్‌కు 20 విలాసవంతమైన భవంతులు ఉన్నాయట. ఆయన ఆస్తుల విలువ దాదాపు రెండు వందల బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఒక అంచనా. మొత్తానికి పుతిన్‌ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన మంచి విలాస పురుషుడు మాత్రమే కాదు శృంగార పురుషుడు కూడా అని అర్థమవుతోంది.

Exit mobile version