Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ను కలవరానికి గురిచేసింది. అయితే 2028లో రష్యా సొంతంగా ‘రోస్’ అనే పేరుతో అంతరిక్షంలో ఓ కొత్త స్పేస్ ఔట్ పోస్టును నిర్మించాలని అనుకుంటోంది. అప్పటి వరకు ఐఎస్ఎస్ లో భాగంగా ఉండాలని రష్యా అధికారులు తమకు తెలిపారని నాసా సీనియర్ అధికారి వెల్లడించారు. రోస్కో స్మోస్ తో నాసా సంబంధాలు ఎప్పటిలాగానే ఉంటాయని నాసా అధికారి వెల్లడించారు.
Read Also: America: అగ్రరాజ్యం అమెరికాలో ‘టాప్’ స్టార్టప్ హీరోలూ మనోళ్లే
అంతరిక్ష పరిశోధనల కోసం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు. రష్యా, అమెరికాతో పాటు కెనడా, జపాన్ వంటి దేశాలతో పాటు 11 యూరోపియన్ దేశాలు ఐఎస్ఎస్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. రెండు దశాబ్ధాలుగా ఐఎఎస్ సేవలను అందిస్తోంది. అయతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తరువాత పరిస్థితులు మారాయి. బద్ధ శత్రువులుగా ఉన్న రష్యా, అమెరికాలు అంతరిక్ష రంగంలో కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా 2024 తరువాత ఐఎస్ఎస్ నుంచి ఉపసంహరించుకుంటామని రష్యా ప్రకటించింది. రష్యా, అమెరికా సాంకేతికతల ఆధారంగా ప్రస్తుతం ఐఎస్ఎస్ పనిచేస్తోంది.