ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్‌ను గడగడలాడిస్తోంది. అంతేధీటుగా ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా సైనిక దళాలపై దాడి చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఉక్రెయిన్‌కు వివిధ దేశాలు మద్దతుగా నిలిచి, ఆయుధాలను అందిస్తున్నాయి. అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘ఏఎన్-225 మ్రియా’ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానంగా , అత్యంత పొడవైన బరువైన విమానంగా కూడా ‘ఏఎన్-225 మ్రియా’ రికార్డ్ నెలకొల్పింది. ఆంటోనోవ్ ఎఎన్-225 మ్రియా అని దీనిని పిలుస్తారు. మిగిలిన కార్గోలకు భిన్నంగా దీనికి ఆరు టర్బో ఫ్యాన్ ఇంజిన్లు, అతిపెద్ద రెక్కలు దీని సొంతం. ఇది ఏకంగా 640 టన్నుల వరకు బరువును మోయగలదు.
అయితే ఈ కార్గో విమానం 2016లో తుర్క్‌మెనిస్థాన్ నుండి ఆస్ట్రేలియాకు 116 టన్నుల బరువైన జనరేటరును తీసుకెళ్తూ మార్గమధ్యంలో సాంకేతికపరమైన అవసరాలకోసం కొద్ది సేపు శంషాబాద్ విమానాశ్రయంలో ఆగింది. అయితే ‘ఏఎన్-225 మ్రియా’ను ధ్వంసం చేయడంపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించి, దీనిని తాము పునఃనిర్మిస్తామని వెల్లడించింది. బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని అధికార ట్విట్టర్ ఖాతాలో ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ విమానం ఫొటోను షేర్ చేసింది.