Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం వదిలి అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి మరింతగా ఆయుధ సాయంతో పాటు ఆర్థిక సాయం కోరేందుకు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.
Read Also: Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అమెరికా, రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తోందని రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆరోపించారు. రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ దేశాన్ని అమెరికా ఎగదోస్తోందని ఆయన ఆరోపించారు. రష్యా ఆందోళనలను వినేందుకు ఇటు జెలన్స్కీ కానీ అటు జో బిడెన్ కానీ సిద్ధంగా లేరని ఆయన అన్నారు. డాన్ బాస్ లోని పట్టణాలు, గ్రామాలపై ఉక్రెయిన్ నిరంతరం దాడులు చేస్తోందని.. దీనిపై అమెరికా ఒక్కమాట కూడా మాట్లాడలేదని.. ఈ సమావేశం నిజమైన శాంతి కోసం కాదని పెస్కోవ్ అన్నారు.
అమెరికా వాషింగ్టన్ లో పర్యటించిన జెలన్ స్కీకి అక్కడ అపూర్వస్వాగతం దక్కింది. అమెరికా ఉక్రెయిన్ కు 1.8 బిలియన్ల సైనిక సాయంతో పాటు పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను అందిస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ లో జెలన్స్కీ ప్రసంగించారు. ఆయనకు అక్కడి ప్రజాప్రతినిధులు రెండు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అమెరికా, ఉక్రెయిన్ కు చేస్తుంది ‘దానం’ కాదని.. ప్రజాస్వామ్యం, ప్రపంచ భద్రతకు ‘పెట్టుబడి’ అని అన్నారు. ఉక్రెయిన్ కు సహకరిస్తున్నందుకు అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు జెలన్స్కీ. ఉక్రెయిన్ ఎప్పటికీ లొంగిపోదని ఆయన అన్నాడు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జనవరిలో అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణిని రష్యా నేవీకి అందిస్తామని పుతిన్ ప్రకటించాడు.