National Medical Commission: కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షకు అర్హత సాధించిన తర్వాత వారు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్‌ఎంఐ) చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ ఓ పబ్లిక్ నోటీసులో తెలిపింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రెండేళ్ల సీఆర్ఎంఐ పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హులు. భారతీయ పరిస్థితులలో వైద్యం చేసే విధానాన్ని వారికి పరిచయం చేయడానికి ఈ రెండేళ్ల పాటు ఈ ఇంటర్న్‌షిప్ సాయపడుతుందని ఎన్‌ఎంసీ ప్రకటించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో తమ క్లినికల్ శిక్షణను ఒకేసారి పూర్తి చేసేందుకు వీలుగా రెండు నెలల్లో ఒక పథకాన్ని రూపొందించాలని రెగ్యులేటరీ బాడీని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆదేశించింది. కరోనా మహమ్మారితో పాటు, ఉక్రెయిన్,-రష్యాల మధ్య జరిగిన యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేకమంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ తర్వాత వారికి భారత్‌లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.