Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం

  • ఇరాన్ పత్రిక సంచలన కథనం
  • 13 మందితో హిట్‌లిస్ట్ విడుదల
  • అంతర్జాతీయంగా సంచలనంగా కథనం
Iranhitlist

Iranhitlist

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తగ్గినట్టే.. తగ్గి మళ్లీ చెలరేగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా అంతర్జాతీయ నాయకుల లక్ష్యంగా ఇరాన్ హిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన హిమ్‌షహ్రీ వార్తాపత్రికలో ప్రచురితం అయింది. ఈ పత్రికను స్వయంగా ప్రభుత్వ అధికారులు ప్రచురిస్తుంటారు. జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల నాయకులు ఉండడం విశేషం. పత్రికలో ప్రచురితం అయిన 13 మంది మంది జాబితాలో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు పలువురున్నారు. ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఇటీవల ట్రంప్ సన్నిహితుడు, ఇరాన్‌తో యుద్ధానికి మద్దతుదారుడైన లిండ్సే గ్రాహం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం వల్లే చనిపోయినట్లుగా తొలుత గ్రాహం కార్యాలయం చెప్పినప్పటికీ.. ట్రంప్ వర్గానికి చెందిన వారు మాత్రం లిండ్సే హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని ఆరోపించారు. లిండ్సే గ్రాహం రెచ్చగొట్టే ధోరణికి పేరుగాంచిన ఒక సంప్రదాయవాది అని ఇరాన్ వార్తాపత్రికలో ప్రచురితం చేసింది. ఇందుకు సంబంధించిన వార్త కూడా వైరల్‌గా మారింది. ఇందులో భాగంగానే లిండ్సే హత్యకు గురైనట్లుగా అమెరికా భావిస్తోంది. ఇప్పుడు తాజాగా 13 మందితో కూడిన జాబితాను ఇరాన్ తన పత్రికలో ముద్రించింది.

ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తాజా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా శపథం చేశారు. శనివారం తండ్రి అంత్యక్రియల తర్వాత మొజ్తబా తొలి సందేశంలో పేర్కొన్నారు. ‘‘ప్రతీకారం మన జాతి ఆకాంక్ష, దానిని ఏ విధంగానైనా నెరవేర్చుకోవాలి.’’ అని వెల్లడించారు.

పత్రికలో ఏముందంటే..

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అధికారులు ప్రచురించే హమ్‌షహ్రీ వార్తాపత్రికలో శనివారం రాత్రి ఆలస్యంగా ఆన్‌లైన్‌లో ఒక ఇన్ఫోగ్రాఫిక్‌ను విడుదల చేసింది. అందులో మొజ్తబా ప్రకటనగా పేర్కొంది. 13 మంది విదేశీ నాయకుల ఫొటోలు ఉన్నాయి. ‘‘ఈ జాబితాలో పేర్లు ఉన్న ఈ నేరస్థులు.. తమ పడకపై ప్రశాంతంగా చనిపోవాలనే కోరికను తమతో పాటు సమాధిలోకి తీసుకువెళతారు.’’ అని అందులో రాసి ఉంది. ‘‘ఆకస్మిక మరణానికి సిద్ధంగా ఉండండి.’’ అని శీర్షిక ఉంది. లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం అమెరికన్, ఇజ్రాయెల్ ‘నేరస్థుల్లో భయాన్ని వ్యాపింపజేసిందని అందులో పేర్కొన్నారు .

జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా ఉన్నారు. ఇరాన్ మాజీ షా కుమారుడైన రెజా పహ్లావి పేరు కూడా ఇందులో ఉన్నాయి. వీరితో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ జాబితా ఆదివారం వెలువడిన సంచికలో మాత్రం ప్రచురించబడలేదు.

యుద్ధ సమయంలో తమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించడంలో ఐరోపా దేశాలు విఫలమయ్యాయని, అమెరికా సైనిక విమానాలను తమ గగనతలంపై ఎగరడానికి అనుమతించాయని, అందువల్ల ఆ దేశాలు కూడా యుద్ధంలో భాగస్వాములయ్యాయని ఇరాన్ ఆరోపించింది. అయితే వార్తాపత్రికలో ప్రచురించిన ఈ హత్యా జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందో లేదో స్పష్టంగా తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనకేమైనా జరిగితే వెయ్యి మిస్సైల్స్ సిద్ధంగా ఉన్నాయని.. ఇరాన్ పూర్తిగా నాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. తాజా పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాలి.