Putin: రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో దేశ ప్రజలు ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. సాయుధ తిరుగుబాటను అణిచివేస్తానని ప్రతిజ్ఞ చేశారు. వ్యక్తిగత ఆశయాలు, స్వార్థ ప్రయోజనాలకు కోసమే ప్రిగోజిన్ ఇలా చేస్తున్నాడని, దేశద్రోహానికి పాల్పడుతున్నాడని పుతిన్ ఆరోపించారు. ఇది రష్యాకు వెన్నుపోటని ఆయన అన్నారు. ఇది రష్యా ప్రజలకు దెబ్బ అని.. మాతృభూమిని కాపాడుకునేందుకు తమ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. దేశద్రోహంలో ఉద్దేశపూర్వకంగా అడుగుపెట్టిన వారు, సాయుధ తిరుగుబాటును సిద్ధం చేసిన వారు, బ్లాక్‌మెయిల్, ఉగ్రవాద పద్ధతులు అనుసరించిన వారు అనివార్యమైన శిక్షలు అనుభవిస్తారని, చట్టానికి, ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిందే అని హెచ్చరికలు జారీ చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానని శపథం చేశారు.
Read Also: Fertilizers : రైతులకు గుడ్‌న్యూస్.. 10 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం
మరోవైపు రష్యా తిరుగుబాటు నేపథ్యంలో అలర్ట్ అయింది. పలు ప్రాంతాల్లో భద్రతను, ఆర్మీని మోహరించింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ నుంచి వాగ్నర్ గ్రూప్ రష్యాలోకి ప్రవేశించి దక్షిన సరిహద్దులోని రోస్తోవ్ పట్టణాన్ని ఆక్రమించింది. అక్కడి మిలిటరీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రిగోజిన్ ఒక వీడియోలో తెలిపారు. వాగ్నర్ సేనల్ని రాజధాని మాస్కో వైపు తీసుకొస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన వద్ద 25000 మంది యోధులు ఉన్నారని, వారంతా రష్యా ప్రజల కోసం చావుకు సిద్ధంగా ఉన్నారని, రష్యా ప్రజలు కూడా తమతో చేరాలని ప్రిగోజిన్ అన్నారు. మేం తిరగుబాటు చేయడం లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. రష్యా మిలిటరీ వాగ్నర్ సేనల్ని టార్గెట్ చేస్తూ చంపేస్తోందని ఆయన ఆరోపించారు.