NTV Telugu Site icon

UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..

Uk

Uk

Indian Mission In UK: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ సారి కూడా భారత దౌత్యసిబ్బంది జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆదివారం ఇదే విధంగా కొంతమంది భారత హైకమిషన్ పై దాడి చేసి భారత జెండాను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో హైకమిషన్ సిబ్బంది భారీ జెండాతో వారికి బుద్ధి చెప్పింది. అయితే ఈ చర్యతో అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు ఉడికిపోతున్నారు. బుధవారం మరోసారి దాడికి తెగబడ్డారు.

Read Also: IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం

ఆందోళనకారులను నిలువరించేందుకు 24 బస్సుల్లో బలగాలతో పాటు మౌంటెడ్ పోలీసులను మోహరించారు. ఈ చర్యతో నిరసనకారులు భారత హైకమిషన్ పైకి నీళ్ల బాటిళ్లను విసిరారు. పోలీసులపై ఇంక్, కలర్స్ పోశారు. చిన్నగా ప్రారంభం అయిన బుధవారం ఆందోళనలో 2000 మంది దాకా పాల్గొన్నారు. పథకం ప్రకారం మహిళలు, చిన్నారులను నిరసనల్లో భాగం చేశారు. బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అంతకుముందు రోజు బ్రిటన్ ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిగా ఇండియా న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ వెలుపల ఉన్న బారికేడ్లను తొలగించింది. ఈ చర్యలో బ్రిటన్ ప్రభుత్వం భారతహైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఆదివారం కూడా ఇదే విధంగా అల్లర్లు జరగడంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. బ్రిటన్ హైకమిషన్ కు సమన్లు జారీ చేసింది. తమ నిరసనను తెలిపింది.