భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్‌లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు వచ్చినట్లు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Read Also: హుజురాబాద్‌లో భారీ ఓటింగ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
కాగా ఎంతో సుహృద్భావ వాతావరణంలో పోప్‌తో ప్రధాని మోదీ సమావేశం జరిగిందని పీఎంవో తెలియజేసింది. త్వరలో భారత్‌లో పర్యటించాలని కోరుతూ పోప్ ఫ్రాన్సిస్‌ను మోదీ ఆహ్వానించారని తెలిపింది. మోదీ ఆహ్వానం పట్ల పోప్ ఫ్రాన్సిస్ సానుకూలంగా స్పందించారని పేర్కొంది. కాగా 1999లో అప్పటి పోప్ జాన్ పాల్-2 భారత్‌లో పర్యటించిన తర్వాత ఇప్పటివరకు మరే పోప్ భారత్‌కు రాలేదు. 1999లో భారత ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నారు. కాగా జీ20 దేశాల సదస్సులో కోవిడ్-19తో ప్రపంచం ఎలాంటి ముప్పును ఎదుర్కొందో పలు దేశాలు చర్చించే అవకాశం ఉంది.