PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్‌కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?

Pok Protests

Pok Protests

PoK: పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత వైఖరిపై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ 38 పాయింట్ల డిమాండ్ల ఒప్పందానికి ఒప్పుకోకపోతే జులై 9న ఆఖరి పోరాటానికి దిగుతామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ సర్కారును హెచ్చరించింది. ఈ తుది పోరాటంలో పీఓకే ప్రజలతో పాటు ప్రవాస కశ్మీరీలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. పీఓకేలో పాక్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను, పౌరుల హత్యలను ప్రపంచ దేశాలు గమనించాలని జేఏఏసీ పిలుపునిచ్చింది. జులై 9న పీఓకేలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రావాలని ఐరాస (UN) ప్రతినిధులు, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC), అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలకు బహిరంగ ఆహ్వానం పలికింది. ఇదే సమయంలో డెడ్‌లైన్ ముగిసేవరకు నిరసనకారులు క్రమశిక్షణతో ఉండాలని సూచించింది.

మాకు భారత్ సాయం కావాలి

ఈ ఉద్రిక్తతల నడుమ జేఏఏసీ కీలక నేత సర్దార్ అమన్ ఖాన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “మాకు భారత్ సహాయం కావాలి. పీఓకేలో ఆహార పదార్థాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. భారత్ మాకు మానవతా సాయం అందించాలి” అని ఆయన ఆ వీడియోలో అభ్యర్థించారు. పరిస్థితులు ఇంకా దిగజారితే పీఓకే పౌరులు ప్రాణాలు దక్కించుకోవడానికి భారత్‌లోకి వచ్చేలా.. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట సరిహద్దులను తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో పీఓకే ప్రజల నిరసనలను అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం క్రూరమైన వ్యూహాలను అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న జేఏఏసీని పాక్ సర్కారు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. ఇప్పటికే 600 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేశాయి. పీఓకేలోకి వెళ్లే నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, అత్యవసర మందుల సరఫరాను నిలిపివేసి పాక్ ప్రభుత్వం అక్కడ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది.