PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..

  • పాకిస్తాన్ పీఓకేలో భారీ నిరసలను..
  • క్రూరంగా అణచివేస్తున్న పాకిస్తాన్ సైన్యం..
  • కాల్పుల్లో 20 మంది మృతి..
Pok Protests

Pok Protests

PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం దారుణాలకు ఒడిగడుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను కాల్చి పారేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 20 మంది ఈ కాల్పుల్లో మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. రావలకోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతుల్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

జూన్ 5 నుంచి పీఓకేలో ఎన్నికలకు, రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రారంభమైంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో 80 మంది మరణించిట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్న వీడియోల్లో రోడ్లపై మృతదేహాలు కనిపిస్తున్నాయి. పీఓకేకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అకీల్ భాయ్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘రావలకోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిపోయింది. అంతర్జాతీయ మీడియా మాకు అండగా నిలవాలి’’ అని కోరారు.

మరోవైపు, పీఓకేలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం 14 వేలకు పైగా సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, కాల్పులకు పాల్పడుతోంది. పీఓకే వ్యాప్తంగా మొబైల్ సేవలు, ఇంటర్నెట్ బంద్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటిని కూడా నిలిపేపేసినట్లు వార్తలు వస్తున్నాయి. పీఓకేలోని 53 సభ్యుల అసెంబ్లీలో 45 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ జూలై 27న జరగగా, మిగిలిన దశలు ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీల్లో నిర్వహించనున్నారు.