PM Shahzab Sharif’s comments on Pakistan’s economic situation: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని డబ్బు కోసం అడుక్కునే దేశంగా చూడటం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం మన మిత్ర దేశాలకు ఫోన్ చేసినా.. మనం వారి వద్దకు డబ్బులు అడుక్కునేందుకు వచ్చామని అనుకుంటున్నారని.. షహబాజ్ షరీఫ్ లాయర్ల సదస్సులో ప్రసంగించారు.
ప్రపంచంలో చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పాకిస్తాన్ దేశాన్ని మించిపోయాయని.. గత 75 ఏళ్లుగా భిక్షాటన కోసం గిన్న పెట్టుకుని తిరుగుతున్నామంటూ బుధవారం ఆయన లాయర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. ఇటీవల పాకిస్తాన్ లో వచ్చిన వరదలు కూడా పాకిస్తాన్ పరిస్థితిని దిగజార్చాయని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి పాకిస్తాన్ దివాళా అంచున ఉందని.. సంకీర్ణ ప్రభుత్వం కృషితో ఆర్థిక ఊబి నుంచి పాకిస్తాన్ బయటపడుతోందని పీఎం షహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ దేశంలో తమ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతోందని ఆయన అన్నారు. తాను అధికారం చేపట్టే సమయానికి దేశంలో ద్రవ్యోల్భనం గరిష్ట స్థాయిలో ఉందని.. ఇప్పుడు కొంత నియంత్రించామని అన్నారు.
Read Also: Tamil Nadu: వక్ఫ్ బోర్డు పరిధిలో హిందూ గ్రామం..1500 ఏళ్ల దేవాలయం భూమి కూడా..
గతంలో ఇమ్రాన్ సర్కార్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ప్రస్తుతం కఠినమైన షరతులతో ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన వెల్లడించారు. బెయిల్ అవుట్ కింది 1.18 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఐఎంఎఫ్ ఇవ్వనుంది. చైనాతో పాటు నాలుగు దేశాలు పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకున్నాయని అన్నారు. రాబోయే శీతాకాలంలో గ్యాస్ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇటీవల పాకిస్తాన్ వరదలతో తీవ్రంగా నష్టపోయింది. మూడింట ఒక వంతు భూభాగం వరద నీటిలోనే ఉంది. ఈ వరదల్లో 1400 మంది చనిపోగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. ఏకంగా 12 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మానవతా సాయం కింద పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు పలు దేశాలు సహాయం చేశాయి. కెనడా, యూఎస్ఏ, యూకే, జపాన్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు సాయం చేశాయి.