Site icon NTV Telugu

PM Modi in Denmark: డెన్మార్క్‌లో ప్రధాని మోడీ ఫస్ట్‌ టూర్‌.. కీలక చర్చలు

Denmark

Denmark

యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్‌హాగన్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్‌ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్‌ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్‌ ప్రధాని అధికారిక నివాసం మానియన్‌ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్‌.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా ఆమె చూపించారు. ఫ్రెడరిక్సన్‌ నివాసం ఆవరణలో ఉన్న పచ్చిక లాన్‌లో ఇద్దరూ తిరుగుతూ వివిధ అంశాలపై ముచ్చటించారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పర్చుకోవడంపై చర్చించారు.

Read Also: Ukraine Russia War: కీలక ప్రకటన చేయనున్న పుతిన్‌.. ఇక విధ్వంసమే..!

డెన్మార్క్‌లో తొలిసారిగా పర్యటించిన మోడీ.. ఆ దేశ ప్రధాని ఫ్రెడరిక్సన్‌తో సమావేశం తర్వాత జాయింట్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాము భారత్‌-ఈయూ సంబంధాలు, ఇండో-పసిఫిక్, ఉక్రెయిన్‌తో పాటు పలు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను కూడా చర్చించినట్లు మోడీ తెలిపారు. ఇరుదేశాలు ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, చట్ట నియమాల విలువలను పంచుకుంటాయన్నారు. భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వీలైనంత త్వరగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణ, సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్యం కోసం ఇరుదేశాలు విజ్ఞప్తి చేసినట్లుగా మోడీ వెల్లడించారు.

Exit mobile version