Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలోని మంత్రులు భారత్‌పై వరసగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలోని పలువురు మంత్రులు భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే మనం మాత్రం అడుక్కుతింటున్నామని పాకిస్తాన్ ఎంపీ తన ఆవేదన వ్యక్తం చేశారు. దీని తర్వాత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ భారత్‌ని ప్రశంసించారు. తమ దేశం వ్యాపారవేత్తలను దొంగలుగా చూస్తుంటే, భారత్ మాత్రం ఆ దేశంలోని వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలుస్తోందని అన్నారు. భారత్ అభివృద్ధి చెందడానికి ఇది ఓ కారణం అంటూ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుందని, ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుందని ఆయన అన్నారు. కానీ పాకిస్తాన్‌లో మాత్రం వ్యాపారవేత్తలు ఎదుగుతుంటే వారిపై దొంగలుగా ముద్ర వేస్తారని చెప్పారు. ఓ వ్యాపారవేత్తగా నా డబ్బును నాకు నచ్చిన చోట పెట్టుబడి పెడతా, నా భార్యకు లండన్‌లో ఆస్తులు ఉన్నాయి, అక్కడ వాటికి పన్నులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. విదేశాల్లో పెట్టుబడి పెట్టడం తప్పుకాదని, అక్రమంగా సంపాదించే ఆస్తులపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపటొచ్చని అన్నారు. పాక్‌కి చెందిన పలు మీడియా సంస్థలకు కూడా దుబాయ్‌లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
Read Also: Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్
ఇదిలా ఉంటే ‘‘దుబాయ్ లీక్స్’’ పేరుతో విడుదలైన ఓ నివేదిక పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పాక్‌కి చెందిన 17 మంది భారీ సంఖ్యలో ఆస్తులను కూడబెట్టినట్లుగా తేలింది. వీటి విలువ దాదాపుగా రూ. 90 వేట కోట్లకు పైగానే ఉంటుందని లెక్క కట్టింది. పాకిస్తాన్ మంత్రి నఖ్వీ భార్య పేరు మీద కూడా ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పిల్లలైన బిలాలవల్ భుట్టో జర్దారీ, భఖ్త్‌వర్ భుట్టో, ఆసీఫా భుట్టో కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాక్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కొడుకు హుస్సేన్ నవాజ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ జావేద్ బజ్వా తనయుడి పేరుపై కూడా ఆస్తులు ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికరుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇలా పాక్ ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లంతా విదేశాల్లో డబ్బును దాచుకుంటే, పాక్‌కి పెట్టుబడులు ఎలా వస్తాయని అక్కడి ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
