NTV Telugu Site icon

Pakistan: “పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది”.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు. ఇటీవల, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుని హైజాక్ చేసి, 200 కి పైగా ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ సిబ్బందిని బీఎల్ఏ హతమార్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బలూచ్ ప్రావిన్సులోని నోష్కి ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడిచేసి 90 మందిని హతమార్చింది. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. సింధ్ ప్రాంతంలో కూడా సింధుస్తాన్, సింధుదేశ్ వంటి ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు వస్తున్నాయి. పీఓకే ప్రాంత ప్రజలు భారత్‌లో కలుస్తామని ఉద్యమిస్తున్నారు.

Read Also: Vizag and Vijayawada Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఎల్ఏ చేతిలో చావుదెబ్బలు తిన్న తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ని ‘‘స్ట్రిక్ట్’’గా మార్చాలని చెప్పారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, ఉగ్రవాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని చెప్పారు. జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలనను మెరుగుపరచాలని ఆయన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను కోరారు. పాకిస్తాన్ స్ట్రిక్ట్‌గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన చెప్పారు. పాలనలో అంతరాల వల్ల పాకిస్తాన్ సైన్యం, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంత కాలం అంటూ ప్రశ్నించారు.