NTV Telugu Site icon

Pakistan: చివరకు పాస్‌పోర్ట్‌లు ప్రింట్ చేసుకోలేని దుస్థితిలో పాకిస్తాన్..

Pakistan3

Pakistan3

Pakistan: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు పాస్‌పోర్టులు కూడా ప్రింట్ చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..

దేశంలో లామినేషన్ పేపర్‌కి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో కొత్త పాస్‌పోర్ట్‌లు అందకు లక్షలాది మంది వేచిచూస్తున్నారు. పాస్‌‌పోర్ట్‌ల ముద్రణకు లామినేషన్ పేపర్ చాలా కీలకం. పాకిస్తాన్ వీటిని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంటోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ వీటిని దిగుమతి చేసుకునేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతోంది. రెండు నెలల క్రితం లామినేషన్ పేపర్ కోసం ఆర్డర్ పెట్టినా.. డబ్బులు లేక చెల్లింపులు చేయకపోవడంతో ఫ్రాన్స్ నుంచి దిగుమతి కాలేదు. దీంతో చేసేదేం లేక పాస్‌పోర్ట్‌ల ముద్రణ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ నుంచి యూకే, ఇటలీ వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరీక్షణ వల్ల తాము అవకాశాలు కోల్పోతున్నామని చెబుతున్నారు. గతంలో 2013లో కూడా పాక్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది.

ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా తెలిపారు. త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుందని, పాస్‌పోర్ట్‌ల జారీ యథావిధిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ వ్యాప్తంగా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకుముందు రోజుకు 3000-4000 పాస్‌పోర్టులను ప్రాసెస్ చేసేవారమని, ఇప్పుడు రోపజుకు 12-13 మాత్రమే పాస్‌పోర్టులు ఇవ్వగలుతుగున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు.