Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..

  • అమెరికా వద్ద 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్థాన్.
  • IMF ప్యాకేజీ కొనసాగుతున్నా ఆర్థిక ఒత్తిడి తగ్గలేదు.
  • విదేశీ మారక నిల్వలు పెంచేందుకు ప్రత్యేక ఫెసిలిటీ ప్రతిపాదన.
Pakistan

Pakistan

Pakistan: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పాకిస్తాన్, అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌కు పంపిన ప్రతిపాదనలో ఐదేళ్ల కాలపరిమితితో ‘బైలేటరల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద 10 బిలియన్ డాలర్ల సహాయాన్ని కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోరింది. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, నిర్మాణాత్మక సంస్కరణల్ని చేపట్టింది. అయినప్పటికీ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కొనసాగుతోంది.

అమెరికా సాయం అందిస్తే పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు పాక్ కరెన్సీపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలపై ఆధారపడటం కొంత వరకు తగ్గుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల పాక్ అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వాన్ని నిర్వహించింది. దీంతో తమ దౌత్యపరంగా తమ ప్రాధాన్యత పెరిగిందని భావిస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి సాయాన్ని ఆశిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ ఇటీవళ అమెరికా ట్రెజరీ సెక్రటరీతో సమావేశమై ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రస్తావించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పాక్ తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ నిధులు, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక సహాయంపై, రుణాలపై ఆధారపడుతోంది.