Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..

  • పాకిస్థాన్ సైనిక కమాండ్ వ్యవస్థలో భారీ మార్పులు చేసింది.
  • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను ఒకే కేంద్రీకృత కమాండ్ కిందకు.
  • ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) బాధ్యతలు
Asim Munir

Asim Munir

Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైన్యం గుప్పిటలోకి వెళ్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నా, పాలన అంతా ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే పరోక్షంగా పర్యవేక్షిస్తోంది. కేవలం ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలుబొమ్మగా మారారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన సైనిక కమాండ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 20న పాకిస్తాన్ పార్లమెంట్ ‘‘డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్ యాక్ట్ 2026’’తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ చట్టానికి సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో కేంద్రీకృత కమాండ్ వ్యవస్థ కిందకు తీసుకువచ్చింది.

అసిమ్ మునీర్ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) బాధ్యతలు కూడా చేపట్టారు. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో ఆయన ప్రధానమంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా మూడు దళాలపై కార్యాచరణ కమాండ్, నియంత్రణ అధికారం కూడా ఆయనకు ఉంటుంది. ప్రధానికి సమానమైన హోదా, ఒక రకంగా చెప్పాలంటే ప్రధానిని మించిన అధికారాలు అసిమ్ మునీర్ చేతిలోకి వెళ్లాయి.

మూడు సేనలకు ఒకే కమాండ్..

కొత్తగా పాకిస్తాన్ తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు కానుంది. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు భూమి, గగనతలం, సముద్రం, సైబర్, వ్యూహాత్మక రంగాల్లో సంయుక్త కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో మూడు దళాలు తమ తమ కమాండ్ వ్యవస్థల కింద పనిచేసేవి. ఇప్పుడు పాకిస్తాన్‌లో మొత్తం మూడు దళాలు ఒకే కమాండ్ కింద పనిచేయబోతున్నాయి.

మరింత శక్తివంతంగా మునీర్..

కొత్త చట్టం ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను మరింత శక్తివంతంగా మార్చింది. అధికారుల పదవీ విరమణ, విధుల నుంచి తొలగించడం, రాజీనామాలను ఆమోదించడం, తిరస్కరించడం, కొందరిని పదవుల్లోనే కొనసాగించడం వంటి అధికారాలు ఆయనకు సంక్రమిస్తాయి. దీనికి తోడు ప్రజా ప్రభుత్వం కూడా ఆయనకు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సైనిక నియామకాలు, ఉన్నత స్థాయి పదవులు, భవిష్యత్ నాయకత్వంపై ఆయన ప్రభావం ఉండబోతోంది.

గమనిస్తున్న భారత్..

2025 మే నెలలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది. భవిష్యత్ యుద్ధాలు, సంక్షోభాల్లో వాయు రక్షణ, క్షిపణి దళాలు, నౌకాదళం, సైబర్ కార్యకలాపాలు, భూతల దళాల మధ్య వేగవంతమైన సమన్వయం పాకిస్థాన్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. మొత్తం సైన్యం ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల కొత్త ఆయుధాలు, సాంకేతిక సామర్థ్యాలు ఆటోమెటిక్‌గా రావు. సమాచార వ్యవస్థలు, నిఘా సమన్వయం, సంయుక్త శిక్షణ, మూడు దళాల మధ్య సమన్వయమే ఈ వ్యవస్థ విజయాన్ని నిర్ణయిస్తాయి. పాక్‌లో జరుగుతున్న సైనిక పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.