Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే జైళ్లలో ఒకటైన ‘అదియాలా సెంట్రల్ జైలు’ (రావల్పిండి జిల్లా జైలు) మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఇదే జైల్లో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ వల్ల కాకుండా, జైలు భద్రతా వ్యవస్థలోని తీవ్ర లోపాల కారణంగా ఈ జైలు వార్తల్లోకెక్కింది. కోర్టు విచారణ ముగించుకుని తిరిగి జైలుకు వస్తున్న క్రమంలో ఏకంగా 14 మంది ఖైదీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో రావల్పిండి, ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
సినిమా స్టైల్‌లో స్కెచ్.. పోలీసుల కళ్లలో మిరపపొడి
మీడియా నివేదికల ప్రకారం.. రావల్పిండి జిల్లా కోర్టులో హాజరుపరిచిన అనంతరం 14 మంది అండర్ ట్రయల్ (విచారణలో ఉన్న) ఖైదీలను ఒక పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి తిరిగి అదియాలా జైలుకు తరలిస్తున్నారు. వ్యాన్ సిహాలా/కహుటా ప్రాంత పరిధిలోకి రాగానే ఖైదీలు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం లోపల గొడవ పడటం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వ్యాన్‌ను ఆపి లోపల ఏం జరుగుతుందో చూడటానికి ప్రయత్నం చేశారు. అదే సమయం కోసం వేచి చూసిన ఖైదీలు.. అత్యంత చాకచక్యంగా పోలీసుల కళ్లలో కారం చల్లారు. కళ్లు కనపడక పోలీసులు విలవిల్లాడుతుండగా, వ్యాన్ తాళాలు పగలగొట్టి 14 మంది ఖైదీలు ఒకేసారి పరారయ్యారు.
నలుగురు రీ-అరెస్ట్.. మిగిలిన వారి కోసం వేట
జైలు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ భద్రతా వైఫల్యంపై రావల్పిండి పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) పరిసర ప్రాంతాలను ముట్టడించాయి. రహదారులన్నింటినీ నాకాబందీ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసుల జరిపిన మెరుపు దాడిలో పారిపోయిన 14 మందిలో నలుగురు ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకోగలిగారు. అయితే మిగిలిన 10 మంది ఇంకా పరారీలోనే ఉన్నారు. పారిపోయిన వారు దొంగతనాలు, దోపిడీలు వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని సమాచారం. ఖైదీల పరార్ వెనుక ఏవైనా జైలు సిబ్బంది హస్తం ఉందా లేదా అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఇమ్రాన్ ఖాన్ భద్రతపై ఆందోళన
హై-ప్రొఫైల్ ఖైదీలు ఉండే అదియాలా జైలు పరిసరాల్లోనే ఈ స్థాయి ఘటన జరగడం ఇప్పుడు పాక్ అంతటా చర్చనీయాంశమైంది. అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఇదే జైల్లో ప్రత్యేక బారక్‌లో ఉన్నారు. ఆయన భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు, పారామిలట్రీ నిఘా ఉన్నప్పటికీ.. ఇలాంటి సంఘటన జరగడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతం పరారైన ఖైదీలు ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండా గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

