Site icon NTV Telugu

Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

Iran War Impact On Pakistan

Iran War Impact On Pakistan

Pakistan in Crisis: తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది పాకిస్థాన్‌.. ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాక్‌. ఇప్పటికే పిండి, నీరు, విద్యుత్ ఇలా ఎన్నో కొరతలతో సతమతమవుతున్న దేశం ఇప్పుడు చమురు కొరతతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల జీవనం కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోంది. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. చమురు, గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read Also: Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

పాక్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక దశలో లీటరు ధర 458 రూపాయలకు చేరుకోగా, ఆ తర్వాత కొంత తగ్గించినప్పటికీ ఇంకా 378 రూపాయల వద్ద కొనసాగుతోంది. దీనిపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “పెట్రోల్ కాదు బంగారం కొనుగోలు చేస్తున్నాం” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంక్షోభానికి అంతర్జాతీయ పరిస్థితులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరా దెబ్బతింది. దీనితో పాటు హార్మూజ్‌ జలసంధి పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి.

ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఆహార ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పిండి, బియ్యం, పప్పులు, వంటనూనె వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం ప్రజలకు మరింత ఇబ్బందిగా మారింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూ ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతోంది. ఇక మరోవైపు రుణభారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. International Monetary Fund సహా పలు దేశాల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి పెరుగుతోంది. కొత్త రుణాలు పొందడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.

ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ప్రభుత్వం కోవిడ్ కాలం తరహా నియంత్రణలను అమలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, వాహన వినియోగాన్ని తగ్గించడం, వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదు. మొత్తంగా చూస్తే, పాకిస్తాన్‌లో సంక్షోభం అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇంధనం, ఆహారం, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒత్తిడిలో ఉండటంతో దేశ ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్లు మూసివేయడంతో దేశం అక్షరాలా నిశ్శబ్దంలోకి జారుకుంటోంది. ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో అన్న అనిశ్చితి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Exit mobile version