Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!

  • పాకిస్తాన్‌లో హిందూ బాలికల కిడ్నాప్, మతమార్పిడి, బలవంతపు పెళ్లి..
  • సింధ్ కోర్టు ముందు కన్నీర పెట్టుకున్నా తల్లిదండ్రులతో పంపించని కోర్టు..
Pakistan

Pakistan

Pakistan Hindu Girls: పాకిస్తాన్‌లో మైనారిటీ హిందూ, క్రిస్టియన్ ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో హిందూ బాలికల అపహరణ, మతమార్పిడి. బలవంతంగా పెళ్లి చేసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. అక్కడి పోలీస్, న్యాయ వ్యవస్థ కూడా ఈ అమ్మాయిలకు సాయం చేయడం లేదు. తాజాగా ఇద్దరు హిందూ బాలికలు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తామని కన్నీరు పెట్టుకున్నా కూడా కోర్టు వారిని షెల్టర్ హోమ్‌కు పంపించింది. తమ కుమార్తెలను అపహరించి, ఇస్లాంలోకి మార్చి బలవంతంగా ఇద్దరు యువకులు పెళ్లి చేసేుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సింధ్‌లోని టాండో అల్లహ్యార్ జిల్లాకు చెందిన 13, 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికల్ని అమ్జద్ సోలంగి, మన్సూర్ సోలంగి అనే ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నట్లు హక్కుల కార్యకర్తలు, బాధిత కుటుంబీకులు ఆరోపించారు. కిడ్నాప్ కేసులో ఇద్దరు బాలికల్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో పంపించకుండా రెండు రోజుల పాటు సేఫ్ హౌజ్‌లకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు వెలుపల బాలికలు కన్నీరు పెట్టుకుంటూ తమను ఇంటికి పంపించాలని పదేపదే వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10 రోజుల్లో ఆరుగురు హిందూ బాలికల అపహరణ..

ఈ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనే టాండో అల్లాహ్యర్ జిల్లాలో 14 ఏళ్ల బాలిక పాన్సీ కోహ్లీ సెప్టెంబర్ 9న కిడ్నాప్‌కు గురైనట్లు హక్కుల కార్యకర్త తెలిపారు. 10 రోజుల వ్యవధిలో ఈ జిల్లాలో ఆరుగురు హిందూ మైనర్ బాలికలు అపహరణకు, మతమార్పిడికి గురైనట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా కోహ్లీ, భీల్, మేఘ్వార్ వంటి అణగారిన వర్గాలకు చెందిన పేద కుటుంబాలు పోలీసు వ్యవస్థ, న్యాయ సహాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో తక్కువ అవకాశాలతో మరింత సున్నిత పరిస్థితుల్లో ఉన్నాయని మైనారిటీ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషన్ కూడా పాకిస్తాన్‌లో వందలాది మంది హిందూ బాలికలు కిడ్నాప్‌కు గురవుతున్నారని, బలవంతపు వివాహాలను ఎదుర్కొంటున్నారని చెబుతోంది.

బాలికల వయసు 13, 14 ఏళ్లుగా తేలితే, సింధ్ చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రెయింట్ యాక్ట్, 2013 ప్రకారం వారు పిల్లలుగా పరిగణించబడతారు. ఈ చట్టం ప్రకారం పురుషులు, మహిళలు ఇద్దరికీ వివాహ కనీస వయసు 18 సంవత్సరాలు. ఇప్పుడు వీరి వయసును నిర్ధారించాల్సి ఉంది.