Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది బయటకు మాత్రమే కనిపిస్తుంటుంది. మొత్తం పాకిస్తాన్ వ్యవస్థల్ని శాసించేది అక్కడి సైన్యమే. ఈ విషయం ప్రపంచానికి కూడా తెలుసు, కానీ తెలిసీతెలియనట్లు వ్యవహరిస్తుంటుంది. సైన్యం కోరుకున్న వారే అక్కడ ప్రధాని అవుతారు. ఇందు కోసం ఎన్నికల్ని రిగ్గింగ్ కూడా చేస్తారు. అవసరం అనుకుంటే ఫలితాలనే మారుస్తారు. తాజాగా ఓ నివేదిక ఇదే విషయాన్ని బయటపెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్ని పరిశీలించేందుకు వచ్చిన కామన్వెల్త్ బృందం కూడా రిగ్గింగ్ జరిగినట్లు చెప్పకుండా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని పొగడటంపై విమర్శలు ఎదుర్కొంటోంది.
లీక్ అయిన పత్రాల ప్రకారం, కామన్వెల్త్ ప్యానెల్ 70 ఏళ్లలో మొదటిసారిగా ఫలితాలను ప్రచురించడంలో విఫలమైంది చెప్పింది. పాకిస్తాన్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై తన నివేదికను ప్రచురించడంలో కామన్వెల్త్ పరిశీలకుల బృందం విమర్శలకు గురైంది. సైనిక మద్దతు కలిగిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో కుమ్మకై, రిగ్గింగ్‌పై వచ్చిన నివేదికను పూడ్చిపెట్టిందని ఆరోపించింది. స్వతంత్ర దర్యాప్తు వార్తా సంప్థ అయిన డ్రాప్ సైట్ న్యూస్ నుంచి ఈ నివేదిక వచ్చింది.
కామన్వెల్త్ సెక్రటేరియట్ దాని సభ్యుల ఎన్నికలకు స్వతంత్ర పరిశీలకుడిగా వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 2024 ఎన్నికలకు 13 మంది ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపిందని యూకేకి చెందిన ది టెలిగ్రాప్ దినపత్రిక తెలిపింది. కామన్వెల్త్ అనేది 56 దేశాల కూటమి. వీటిలో ఎక్కువ దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ టీం పాక్‌లో జరిగిన ఎన్నికల అవకతవకలను నివేదించడంలో విఫలమైంది. ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సమావేశ హక్కుల వంటి ప్రాథమిక రాజకీయ హక్కుల్ని ఉల్లంఘించిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.
Read Also: Apollo Tyres: గాలి తీసేసిన టైర్ నుంచి.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ వరకు.. ఏం జర్నీ బాస్
పాకిస్తాన్ సైన్యం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ ఎన్నికల గుర్తును నిషేధించడంతో పాటు, ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసేలా బలవంతం చేసిందని లీక్ అయిన నివేదిక ఆధారంగా, టెలిగ్రాఫ్ కథనాన్ని ప్రచురించింది. కామన్వెల్త్ ప్యానెల్ తప్పును కప్పిపుచ్చేలా ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలను మార్చిందని చెప్పింది. కొంత మంది వ్యక్తుల్ని చట్టవిరుద్ధంగా విజేతలుగా ప్రకటించి ఉండొచ్చని నివేదిక చెప్పింది. కామన్వెల్త్ సెక్రటేరియల్ తన ఫలితాలను అప్పటి సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ కు సమర్పించిందని, వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వంతో దీనిని పంచుకుందని, కానీ పాక్ ప్రభుత్వం ఈ నివేదికను అణచివేయాలని కామన్వె్ల్త్‌ను కోరిందని టెలిగ్రాఫ్ చెప్పింది.
ఓటింగ్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల నివేదికలను విడుదల చేయాలని సెక్రటేరియట్‌ను ప్రోటోకాల్ ఆదేశించినప్పటికీ, కామన్వెల్త్ యొక్క ఫలితాలు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ప్రచురించబడలేదు. యూరోపియన్ యూనియన్ నివేదిక కూడా విడుదల కాలేదు. పాకిస్తాన్ సైన్యం తమ అధికారం ఉండేందుకు ఈ ఎన్నికల మోసానికి పాల్పడినట్లు నివేదిక చెప్పింది. ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, పాక్ సైన్యంతో కలిసి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆరోపించారు. తాజాగా ఈ నివేదిక వెలుగులోకి రావడంతో ‘‘కామన్వెల్త్, యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ ప్రజస్వామ్యాన్ని పరిశీలించి మొదటిసారిగా 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి సొంత నివేదికను అణిచివేసింది’’ ఎక్స్‌లో రాశారు.