ఇరాన్-అమెరికా మధ్య ఇంకా శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. తాజాగా ఇరాన్ ప్రతిపాదించిన అంశాలను అమెరికా తిరస్కరించింది. దీంతో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ ప్రారంభం అవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం జరుగుతుందా? ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగుతాయా? అనే ప్రశ్నలకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఊహ ప్రకారం.. ఇరాన్‌లో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇజ్రాయెల్ మీడియా కథనాల్లో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కొన్ని దేశాలపై దాడులు చేయాలని తీవ్రంగా కోరుకుంటోందని.. అయితే అమెరికా మరో దేశం కోసం యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ‘‘“నా అంచనా ప్రకారం మళ్లీ యుద్ధం జరగదు.’’ అంటూ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించవచ్చన్న మీడియా కథనాలను కొట్టిపారేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజాభిప్రాయం కూడా స్పష్టంగానే ఉందని.. ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం చేయాలని ప్రజలు కోరుకోవడం లేదని.. ప్రజల మద్దతు లేకుండా యుద్ధాలు కొనసాగించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్, చైనా, రష్యా వంటి దేశాలు కూడా ఇరాన్‌లో మళ్లీ యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఈ వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. అమెరికా, ఇరాన్ మధ్య సందేశాలు చేరవేస్తోంది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ముస్లిం దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆసిఫ్ వ్యాఖ్యలు రావడానికి ముందు ఇరాన్ తాజాగా యుద్ధం ముగించేందుకు అమెరికాకు మరో కొత్త ప్రతిపాదన పంపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చర్చలు కొనసాగేందుకు కొత్త సైనిక దాడులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయని.. చివరికి అమెరికాకు మాత్రమే కాకుండా పశ్చిమాసియా దేశాలకు కూడా ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆ ఒప్పందంలో “ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు” అనే అంశం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
గత ఆరు వారాలుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తీవ్ర దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ముడి చమురు ధరలు భారీగా పెరిగి అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
