Pakistan: “మ్యాన్‌హోల్స్” దొంగలతో పాకిస్తాన్ కంగారు.. భారీ శిక్షలు ప్రకటించిన దాయాది..

  • పాక్‌ను కంగారు పడుతున్న ‘‘మ్యాన్‌హోల్’’ దొంగలు..
  • మూతలు దొంగిలిస్తే 10 ఏళ్ల జైలు, 50 లక్షలు ఫైన్..
Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. చివరకు ఆ దేశంలోని దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, భారీ శిక్షల్ని ప్రకటించింది. మ్యాన్‌హోల్స్‌కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది.

మ్యాన్ హోట్స్ మూతలు దొంగిలిస్తే శిక్షగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల పాకిస్తానీ రూపాయలు జరిమానా విధించనున్నారు. ఈ చట్టానికి ‘‘గట్టర్ చట్టం’’ అని పిలుస్తున్నారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ ఈ శిక్షల గురించి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

Read Also: AP High Court: ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఎస్పీకి కీలక ఆదేశాలు

‘‘మేము ఉదయం మూతల్ని బిగిస్తాము, సాయంత్రానికి అవి మాయమైపోతాయి. మురుగు కాలువ మూతల్ని దొంగిలించవద్దు’’ అని ఆమె కోరారు. మ్యాన్ హోల్స్ దొంగతనాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. “మ్యాన్‌హోల్ మూతలను దొంగిలించినా, అమ్మినా లేదా కొనుగోలు చేసినా వారికి 1 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, మరియు దానివల్ల ఎవరైనా మరణిస్తే, శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల (పాకిస్థానీ రూపాయలు) వరకు జరిమానా విధించబడుతుంది,” అని ఆమె హెచ్చరించారు.

ఇటీవల లాహోర్‌లోని దాతా దర్బార్ ప్రాంతంలో మూత లేని మ్యాన్‌హోల్‌లో పడి తల్లి, కుమార్తె మరణించారు. దీని తర్వాత పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలే జరిగాయి. మ్యాన్ హోల్ మూతలు సుమారుగా 30 కిలోల ఐరన్ కలిగి ఉన్నాయి. వీటిని దొంగిలించి అమ్మితే డబ్బులు వస్తుండటంతో , పాక్ వ్యాప్తంగా వీటి దొంగతనాలు నిత్యకృ‌త్యంగా మారాయి. మరోవైపు, పాకిస్తాన్ లో 45 శాతం పేదరికం ఉంది. ఇందులో 16.5 శాతం మంది తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో తమ ఇళ్లు గడవడానికి మ్యాన్‌ హోల్ మూతల్ని కూడా వదలడం లేదు.