Bomb blast in Balochistan: పాకిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ లోని కోహ్లు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే క్షతగాత్రులను కోహ్లులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడుపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు. ప్రస్తుతం విషమంగా ఉన్నవారిని డేరా ఘాజీ ఖాన్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ ప్రావిన్సులో తరుచుగా ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ పాక్ ఆర్మీ, చైనా జాతీయులు లక్ష్యంగా దాడులు నిర్వహిస్తుంది. అయితే బీఎల్ఏ కూడా ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.
Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్య్రం కోసం దశాబ్ధాలుగా పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ప్రజలను తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడ పౌర హక్కుల నేతలు, బలూచ్ మద్దతుదారులు తరుచుగా కనిపించకుండా పోతున్నారు. వారంతా ఏమయ్యారనేది ఇప్పటికీ తేలడం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే వారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యలకు పాల్పడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును ఆధునీకీకరిస్తోంది చైనా. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా బలూచిస్తాన్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో చైనీయుల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో చైనీయులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా బలూచిస్తాన్ మద్దతుదారులు దాడులు చేస్తుంటారు. బలూచిస్తాన్ తో పాటు సింధ్ ప్రావిన్సుల్లో తరుచుగా ఈ సంస్థ దాడులకు చేస్తుంది.