NTV Telugu Site icon

Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..

Pak Army

Pak Army

Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం అనేవి బయటకు కనిపించినా, అక్కడ అంతా సైనిక జోక్యమే ఎక్కువ. సైన్యం చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలి. చివరకు వారికి ఎదురు తిరిగితే జైలు జీవితమే గతి అనేది ఇమ్రాన్ ఖాన్ ఉదంతమే తెలుపుతోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ పోలీసులను చితక్కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబట్టి కొట్టారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్సులోని బహవల్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఒక సైనికుడి కుటుంబ సభ్యుడి నుంచి అక్రమ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న వివాదంలో పాకిస్తాన్ సైన్యం పోలీస్ అధికారులపై దాడి చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పాక్ ఆర్మీపై అక్కడి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీడియోలో పోలీసులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, అందులో కొంతమంది తమను కొట్టవద్దని వేడుకోవడం చూడొచ్చు. ముగ్గురు పౌరుల్ని పోలీసులు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి, వారిని విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: PM Modi: అతి త్వరలో జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ప్రధాని మోడీ..!

వీరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆర్మీ అధికారి నివాసంపై దాడి చేశారు. దీంతో ఆర్మీ సిబ్బంది ఈ ముగ్గురిని విడిపించేందుకు బహవల్‌నగర్ లోని మదర్సా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు చిత్రహింసలకు గురయ్యారని పోలీస్ ఉన్నతాధికారులు గురువారం అక్కడి మీడియాకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆర్మీ సిబ్బంది చేతిలో తన్నులు తిన్న పోలీస్ అధికారులు ఎస్‌హెచ్ఓ అబ్సాస్ రిజ్వాన్, మహ్మద్ నయిమ్, మహ్మద్ ఇక్బాల్, అలీ రెజా అనే నలుగుర్ని సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు. అయితే, పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఘటనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన హమ్మద్ అజార్ మాట్లాడుతూ.. పంజాబ్ పోలీస్ చీఫ్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ ఈ అవమానకర ఘటన తర్వాత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.