NTV Telugu Site icon

Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో పోలీసుల వీరంగం.. భార్య ఇంట్లో ఉండగా దాడి..

Imran Khan

Imran Khan

Pakistan: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. గవర్నమెంట్ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ గా వివాదం ముదురుతోంది.  ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వెళ్లగానే పాక్ పోలీసులు ఆయన ఇంట్లో వీరంగం సృష్టించారు. లాహోర్ లోని జమాన్ పార్క్ లో ఉన్న ఇమ్రాన్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన లేని సమయంలో శనివారం ఇంట్లో ప్రవేశించారని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీ ఆరోపించింది. ఆయన భార్య బుష్రా బేగం ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారని ఆరోపించారు.  అవినీతి ఆరోపణల కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో ఇదంతా జరిగింది.

Read Also: Covid Cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 4 నెలల్లో అత్యధికం!

పోలీసులు ఏ చట్టం ప్రకారం నా ఇంటిపై దాడి చేస్తున్నారంటూ,  పరారీలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను క్విడ్ ప్రోకోగా అధికారంలోకి తీసుకురావడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారంంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.  పోలీసులు తన ఇంటిపై దాచే వీడియోను పీటీఐ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.  పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్యుద్ధం దిశగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు, పాక్ రేంజర్లు విఫలయత్నం చేశారు.  ఆయన పార్టీ మద్దతుదారులు, ప్రజలు పోలీసులకు అడ్డుగా నిలిచారు. దీంతో జమాన్ పార్క్ యుద్ధవాతావరణాన్ని తలపించింది. చివకు లాహోర్ హైకోర్టు కలుగచేసుకుని తర్వాతి రోజుకు అరెస్టును వాయిదా వేయాల్సి వచ్చింది.

పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు మద్దతు తెలిపినట్లు పాక్ మీడియా వెల్లడిస్తోంది. దీంతో ఏ క్షణానైనా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తనను అరెస్ట్ చేసి ప్రభుత్వం, ఆర్మీ చంపాలని చూస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య పాక్ లో పరిస్థితి రోజురోజు ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ లో రాజకీయ అస్థిరత చోటు చేసుకుంది.