Site icon NTV Telugu

Pakistan: ప్రజలు వద్దు, చైనీయులు ముద్దు.. వారి రక్షణ కోసం భారీగా పోలీస్ భద్రత

Pakistan China

Pakistan China

Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ చైనీయులకు మాత్రం ఎలాంటి హానీ కలగకూడదని భావిస్తోంది. అప్పుల్లో కూరుకుపోవడానికి ఓ రకంగా కారణం అయిన చైనాను ఇంకా పాకిస్తాన్ నమ్ముతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొంతలో కొంత చైనా, పాక్ కు మళ్లీ రుణాలు ఇస్తోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో చైనీయులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిపై దాడులు తీవ్రం అయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాలో పనిచేస్తున్న చైనీయులే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.

Read Also: Tillu Venu: ‘బలగం’ కథ మా నాన్న చావు నుంచి రాసుకున్నా… కథ ఎవరిదో కాదు

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ (ఎస్‌ఎస్‌యు)కి చెందిన 1,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించింది. వీరంతా చైనీయులకు భద్రత కల్పించనున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉండే జిల్లా పోలీసులు అదనం. ఎలైట్ ఫోర్స్, ఫ్రాంటియర్ రిజర్వ్ పోలీస్ కూడా ఈ ప్రాంతంలో మోహరించారు.

ఓ నివేదిక ప్రకారం ఖైబర్ ప్రాంతంలో గతేడాది 495 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే ఇక బలూచిస్తాన్ గ్వాదర్ పోర్టులో పనిచేస్తున్న చైనా జాతీయులకు ఎలాంటి లోపం లేకుండా భద్రత కల్పిస్తామని అక్కడి హోం మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన భద్రతను పర్యవేక్షించారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో సైనికులు, పోలీసులు, చైనీయులే లక్ష్యంగా పాకిస్తాన్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఇక బలూచిస్తాన్లో, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వేర్పాటువాదులు చైనీయులకు, పాక్ సైన్యానికి చుక్కలు చూపెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రజలు, పోలీసులకు దాడుల నుంచి రక్షణ లేదు, కానీ చైనీయులకు మాత్రం పాక్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

Exit mobile version