NTV Telugu Site icon

Ukraine War: బఖ్‌ముత్‌లో మారణహోమం.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం..

Bakhmut

Bakhmut

Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Read Also: ED: లాలూ అక్రమ సంపాదన రూ.600 కోట్లు.. రూ.150 కోట్ల భవనాన్ని 4 లక్షలకే కొనుగోలు..

ఇదిలా ఉంటే బఖ్‌ముత్ లో జరుగుతున్న పోరాటంలో ఒకే రోజు 500 మందికి పైగా రష్యన్ సైనికులు గాయలపాలవడంతో పాటు చంపబడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. బఖ్‌ముత్‌లో 23 ఘర్షణలు జరిగాయని, 24 గంటల వ్యవధిలో రష్యన్లు 16 దాడులకు పాల్పడ్డారని తూర్పు దళాలకు చెందిన సైనిక ప్రతినిధి సెర్హి చెరెవాటీ తెలిపారు. ఈ పోరాటంలో 221 మంది రష్యా సైనికులు మరణించడంతో పాటు 314 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలను రష్యా కానీ ఇతర ఏ మీడియా కానీ ధృవీకరించలేదు.

మరోవైపు బఖ్‌ముత్‌ ఎలాగైనా రష్యా దక్కించుకోకుండా పోరాడతామని గతంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ ప్రకటించారు. ఈ నగరం ఒక వేళ రష్యా చేతిలోకి వెళ్తే దాదాపుగా యుద్ధం పూర్తవుతుంది. ఉక్రెయిన్ ఓటమి ఖరారు అవుతుంది. అందుకనే బఖ్‌ముత్‌ కోసం ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాంతం రష్యా వశం అయితే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి రహదారిగా మారుతుందని ఉక్రెయిన్ భయపడుతోంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకు 10 వేల మంది మరణించారు. మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారు.

Show comments