Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే సీఈఓగా ఉన్నారు. ఒకప్పుడు గ్రాఫిక్ చిప్ డిజైన్ కంపెనీగా ప్రారంభమైన ఎన్విడియా, ఇప్పుడ ప్రపంచ ఏఐ పరిశ్రమకు కీలకంగా మారింది. చాట్‌జీపీటీ(ChatGPT) ప్రారంభమైన 2022 నుంచి ఎన్‌విడియా షేర్లు 12 రెట్లు పెరిగాయి.
Read Also: Cyclone Montha Damage: మొంథా తుఫాన్‌తో భారీ నష్టం.. ఏపీలో ప్రాథమిక అంచనాలు ఇవే..!
కంపెనీకి 500 బిలియన్ డాలర్ల విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని చెప్పడంతో పాటు, అమెరికా ప్రభుత్వానికి 7 సూపర్ కంప్యూటర్లను నిర్మించే ప్రణాళికను మంగళవారం హువాంగ్ ప్రకటించారు. హువాంగ్ ప్రస్తుత షేర్ల విలువ సుమారుగా 177 బిలియన్ డాలర్లు. దీని ద్వారా ఆయన ప్రపంచంలోనే 8వ అత్యంత ధనవంతుడి స్థానంలో నిలిచారు. ఎన్విడియా రూపొందించిన H100, బ్లాక్‌వెల్ చిప్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి వెన్నెముకగా మారాయి. చాట్ జీపీటీ, ఎలాన్ మస్క్ xAI వంటి లార్జ్ లాంగ్వెజ్ మోడళ్లలో ఇవి కీలకంగా మారాయి.
అయితే, ఈ పరిణామాల గురించి నిపుణులు హెచ్చరించారు. ఏఐ రంగంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నా, ఈ ధోరణి అధికం అయితే మార్కెట్ బబుల్ ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం ఎన్విడియా అమెరికా, చైనా టెక్ పోటీలో కీలకంగా మారింది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశంలో ఎన్విడియా బ్లాక్‌వెల్ చిప్ ప్రధాన చర్చాంశంగా మారే అవకాశం ఉంది.