Site icon NTV Telugu

North Korea: సముద్రంలో కుప్పకూలిన నార్త్ కొరియా స్పై శాటిలైట్..

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూఢచారి ఉపగ్రహం సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఎంతో కీలకంగా భావించారు. జపార్, సౌత్ కొరియాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రయోగం చేపట్టారు. అయితే శాటిలైట్ ప్రయోగ సమయంలో రాకెట్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో సముద్రంలో కుప్పకూలిపోయినట్లు ఆదే మీడియా వెల్లడించింది.

ఈ ప్రయోగానికి కిమ్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. స్వయంగా ఆయన వెళ్లి సైంటిస్టులతో మాట్లాడటంతో పాటు ప్రయోగాన్ని సమీక్షించారు. తన కుమార్తె జుయితో కలిసి ఇటీవల రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తర కొరియా అధికారుల ప్రకారం.. నార్త్ ఫియోంగాన్ ప్రావిన్స్‌లోని చోల్సాన్ కౌంటీలోని సోహే శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి చొల్లిమా-1 అనే రాకెట్ ద్వారా మల్లిగ్యోంగ్-1 అనే సైనిక స్పై శాటిలైట్ ను ప్రయోగించారు. రాకెట్ మొదటి దశ పూర్తయిన తర్వాత రెండో దశలో రాకెట్ లో ఇంజిన్ అసాధారణంగా పనిచేయడంతో సముద్రంలో కూలిపోయింది. ప్రయోగం విఫలం అవడానికి కారణాలు అణ్వేషించి త్వరలో రెండో ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.

Read Also: Air India: ఫ్లైట్ లో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. సిబ్బంది పై దాడి..

ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిందని.. ఇది రాడార్ నుంచి అదృశ్యమైందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం గురించి ఒక రోజు ముందు జపాన్ కు సమాచారం ఇచ్చింది. జపాన్, దక్షిణ కొరియా ఈ ప్రయోగాన్ని తీవ్రంగా విమర్శించాయి. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో కూడిన ఎలాంటి పరీక్షల నుంచి ఉత్తర కొరియాను నిరోధించేలా ఐక్యరాజ్య సమితిని ఆంక్షలను ఉల్లంఘించిందని విమర్శించాయి.

ఉత్తర కొరియా, అమెరికా-దక్షిణ కొరియాల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ ఇటీవల కాలంలో విపరీతంగా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షిస్తూ పోతోంది. 2019లో అమెరికాతో దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలం అయినప్పటి నుంచి ఉత్తర కొరియా సైనిక అభివృద్ధిని రెట్టింపు చేసింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ గత సంవత్సరం తన దేశాన్ని “తిరుగులేని” అణుశక్తిగా ప్రకటించాడు.

Exit mobile version