Site icon NTV Telugu

North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సాయుధ దళాలు వెల్లడించాయి. దక్షిణం వైపుగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఈ ప్రయోగాన్ని ధృవీకరిస్తూ జపాన్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత దక్షిణ కొరియా ప్రయోగం గురించి మంగళవారం ప్రకటించింది.

గతంలో మే-ఆగస్టు నెలల్లో ఇలాగే నార్త్ కొరియాలోని కిమ్ సర్కార్ స్పై శాటిలైట్‌ని కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలమైంది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఉత్తర కొరియా ప్రయోగాన్ని నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ యూఏన్ తీర్మానాలను ఉల్లంఘిస్తోందని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి.

దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఈ ప్రయోగాన్ని ధృవీకరించాయి. టోక్యో ఒకినావాలోని దక్షిణ ప్రాంతంలోని నివాసితులు సురక్షిత ప్రాంతంలో రక్షణ పొందాలని హెచ్చరించింది. ఉత్తరకొరియా మరో గూఢచార ఉపగ్రహ ప్రయోగం చివరి దశలో ఉందని వారం క్రితం దక్షిణ కొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఆపరేషన్స్ చీఫ్ డైరెక్టర్ కాంగ్ హో పిల్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా ప్రయోగాన్ని చేపడితే మా ప్రజల ప్రాణాలకు భద్రత హామీ ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని సోమవారం చెప్పారు.

Read Also: Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..

రష్యా సహాయం:

తాజా ఉపగ్రహ ప్రయోగానికి నార్త్ కొరియాకు రష్యా సహకరించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా, నార్త్ కొరియా నుంచి ఆయుధాలను కోరింది. ఇందుకు ప్రతిగా శాటిలైట్, సబ్ మెరైన్ టెక్నాలజీని కిమ్ కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉత్తర కొరియా శాటిలైట్ పరీక్షకు సాయం చేసిందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

గూఢచార ఉపగ్రహం వల్ల ఈ ప్రాంతంలో నిఘాను పెంచవచ్చని ఉత్తర కొరియా భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా సైనిక సామర్థ్యంపై, సరిహద్దుల్లో నిఘా పెంచుతుంది. అయితే ఉత్తర కొరియా చర్యలు రెచ్చగొట్టే చర్యలుగా దక్షిణ కొరియా, అమెరికా అభివర్ణించాయి. ఈ ఏడాది ఉత్తరకొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం కొరియా ద్వీపకల్పంలో పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చాయి.

Exit mobile version