చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటిందంటే… అమెరికాపై కరోనా ఏ విధంగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్ కొరియా కరోనా ఒమిక్రాన్ తో అల్లాడుతోంది. ఆ దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అవ్వడంతో… దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కిమ్ అన్నారు. కొవిడ్ -19 వ్యాప్తిని ‘ గొప్ప విపత్తు’గా పోల్చాడు. కోవిడ్ చర్యలపై కిమ్ పార్టీ పోలిట్ బ్యూరోతో సమావేశం అయ్యాడు. దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని ఆర్మీని ఆదేశించారు.
నార్త్ కొరియాలో కరోనా మరణాలు, కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా 21 మంది కరోనా బారిన పడి మరణించారు. శనివారం వరకు మొత్తం 27 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్క శుక్రవారంమే దేశంలో 1,74,440 కరోనా సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,24,440 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. 2,80,810 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఉత్తర కొరియా అధికార వర్గాలు తెలిపాయి.